వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్‌గా పెట్టుకుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై, కనీసం ఒక్క చర్య కూడా లేదన్నారు. విచారణకు సైతం దిక్కులేదన్నారు. రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు..కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారన్నారు.
కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఏపీని పోర్టులకు హబ్‌గా మార్చే పాలసీలు సరే… మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..? అని ఆమె నిలదీశారు. ప్రతి ఏటా దాదాపు రూ.2వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసి ఇచ్చిందన్నారు షర్మిల. నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ.9వేల కోట్ల విలువజేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు పుట్నాల కింద అమ్మారని 2,800 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను అదానీకి కట్టబెట్టారని మండిపడ్డారు.
BOT కింద ఇంకో 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వపరం అవ్వాల్సిన పోర్టు అదని… అదానీకి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవు. కళ్ళు మూసీ తెరిచేలోగా అన్ని అనుమతులు ఇచ్చేశారన్నారు. పైగా మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగం అని బుకాయించారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మీ మాటలకు,ఇచ్చిన హామీలకు, ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలకు ఎంతమాత్రం పొంతన లేదన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.