YS Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తోంది. షర్మిల కొంతకాలంగా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ఆర్‌టీపీ నుంచి కొద్ది రోజులుగా ఎలాంటి కార్యక్రమాలు ఉండటం లేదు. షర్మిల కూడా సొంతంగా కార్యక్రమాలు చేపట్టడం లేదు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడం వల్లే ఇదంతా అనే ప్రచారం ఊపందుకుంది. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమే.
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత షర్మిల వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయబోతుంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. వైఎస్సార్‌టీపీ స్థాపించిన తర్వాత తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు షర్మిల ప్రకటించారు. అనేక సమీకరణాల మధ్య ఆ నియోజకవర్గం అయితే బెటర్ అని షర్మిల డిసైడయ్యారు. తన పాదయాత్రను పాలేరు నుంచే ప్రారంభించారు. అక్కడ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరనున్న నేపథ్యంలో లెక్కలు మారిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆమె సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా.. లేదా విలీనం చేసినా.. షర్మిల పోటీ చేసే స్థానాన్ని కాంగ్రెస్ పెద్దలే నిర్ణయిస్తారు. పాలేరులో పోటీ చేయాలన్నా కాంగ్రెస్ అంగీకరించాలి.
ఒకవేళ కాంగ్రెస్ నుంచి పాలేరులో పోటీ చేసేందుకు అనుమతి రాకుంటే, సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారు. పాలేరు తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గమే తనకు కలిసొస్తుందని ఆమె అనుకుంటున్నారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. సికింద్రాబాద్‌లో క్రిస్టియన్ల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో క్రిస్టియన్ మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. షర్మిల కూడా క్రిస్టియనే కావడంతో వారి ఓట్లు తనకే పడతాయన్న ధీమాతో షర్మిల ఉంది. అటు కాంగ్రెస్ ఓట్లు, వైఎస్సార్ ఓట్లతోపాటు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కూడా తోడైతే సికింద్రాబాద్‌లో సులభంగా గెలవొచ్చన్నది షర్మిల అంచనా. గతంలో ఇక్కడి నుంచి సినీనటి జయసుధ, మేరీ రవీంద్రనాథ్ వంటి క్రిస్టియన్లు గెలుపొందారు. ఈ లెక్కన సికింద్రాబాద్ నుంచి తన విజయం కూడా సులభమవుతుందని షర్మిల ప్లాన్. ప్రస్తుతానికి షర్మిల అటు పాలేరు.. ఇటు సికింద్రాబాద్.. రెండు నియోజకవర్గాలపైనా ఫోకస్ చేశారు. కాంగ్రెస్ సూచనకు అనుగుణంగా రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తారు.