YS Sharmila: షర్మిల పార్టీ కార్యక్రమాలన్నీ బంద్..! కాంగ్రెస్‌లో చేరేందుకేనా..?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ కార్యక్రమాలను మరింత స్పీడప్ చేయాల్సింది పోయి గప్ చుప్ అయిపోయారు. గతంలో లాగా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు లేవు. కేవలం ట్వీట్లకు, ప్రకటనలకు మాత్రమే షర్మిల పరిమితమయ్యారు.

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 01:54 PM IST

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమంటూ వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో ఎవరూ చేయని విధంగా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ కార్యక్రమాలను మరింత స్పీడప్ చేయాల్సింది పోయి గప్ చుప్ అయిపోయారు. గతంలో లాగా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు లేవు. కేవలం ట్వీట్లకు, ప్రకటనలకు మాత్రమే షర్మిల పరిమితమయ్యారు. పార్టీని నడపలేపక చేతులెత్తేశారా..? కాంగ్రెస్ లో చేరేందుకోసమే కామ్ అయ్యారా..?

షర్మిల తన పార్టీనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారని కొంతకాలంగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి షర్మిల అధికారికంగా ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిసి పార్టీ విలీనానికి సంబంధించిన చర్చలు జరిపారు. అలాగే తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలను కూడా కలిసి తన పార్టీ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలు ముందుంచారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వైఎస్సార్టీపీని విలీనం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించి షర్మిల భర్త అనిల్ తో ఆయన సంప్రదింపులు జరిపారు. బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లోనే షర్మిల పార్టీ విలీనం ఖాయమనుకున్నారు. అయితే దానికి బ్రేక్ పడింది.

కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం కాలేదు.. అలాగే తెలంగాణలో పార్టీ కూడా కార్యక్రమాలు జరగట్లేదు. దీంతో అసలు షర్మిలకు ఏమైందనే చర్చ మొదలైంది. అయితే పార్టీ విలీనానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. షర్మిలను తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో వాడుకోవాలని కొంతమంది నేతలు పట్టుబడుతున్నారు. షర్మిల మాత్రం తాను ఆంధ్రా వెళ్లే ప్రసక్తే లేదని.. తెలంగాణలోనే ఉంటానని పట్టుబడుతున్నారు. దీంతో ఆమె సేవలను ఎక్కడ వినియోగించుకోవాలనేదానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అందుకే పార్టీ విలీనం ఆలస్యమవుతోంది. మరోవైపు ఇది తేలేవరకూ పార్టీ కార్యక్రమాలను పక్కనపెట్టాలని షర్మిల నిర్ణయించుకున్నారు.