YS Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమా..? వైఎస్సార్టీపీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందా..?

ఇటీవల షర్మిల పలుమార్లు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం, తన పార్టీ విలీనం వంటి అంశాలపై చర్చలు జరిపారు. డీకేతో జరిపిన చర్చలు ఫలించడంతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల అంగీకరించినట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - June 19, 2023 / 12:47 PM IST

YS Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారా..? ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనుందా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ షర్మిల చేసిన ట్వీట్ ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది.
రెండేళ్లక్రితం వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానన్నారు. దొరల గడీని బద్దలు కొడతానన్నారు. అయితే, ఇప్పటివరకు షర్మిల మినహా చెప్పుకోదగ్గ నేతలెవరూ పార్టీలో చేరలేదు. పార్టీకి ఆదరణ దక్కలేదు. తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేసినా షర్మిల పార్టీని పట్టించుకున్నవాళ్లే లేరు. వివాదాలతో మీడియాలో కొద్దిపాటి ప్రచారం దక్కింది. వీలున్నప్పుడల్లా అధికార బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. అప్పుడప్పుడూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కూడా విమర్శించారు. ఏం చేసినా పార్టీకి ఆదరణ దక్కదని షర్మిలకు అర్థమైంది. ఈ నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు.
డీకేతో చర్చలు
షర్మిలకు అత్యంత ఆత్మీయులైన వ్యక్తుల్లో కేవీపీ రామచంద్ర రావు ఒకరు. ఆయన దివంగత వైఎస్సార్‌కు స్నేహితుడు. ఆయనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన తెచ్చారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఈ విషయంలో షర్మిలను ఒప్పించి, కాంగ్రెస్ పెద్దలను కలిపించారు. ఇటీవల షర్మిల పలుమార్లు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం, తన పార్టీ విలీనం వంటి అంశాలపై చర్చలు జరిపారు. డీకేతో జరిపిన చర్చలు ఫలించడంతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు కాబట్టే రాహుల్ గాంధీని విష్ చేస్తూ సోమవారం షర్మిల ట్వీట్ చేశారు.
ఏపీలో చేరుతారంటూ ప్రచారం
షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమే అయినా.. ఆమె ఏపీ కాంగ్రెస్‌కు వెళ్తారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుంటే.. ఏపీలో మాత్రం బలహీనంగానే ఉంది. అందుకే షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. షర్మిల పుట్టింది ఏపీలోనే అనే సంగతి తెలిసిందే. అయితే, షర్మిల తెలంగాణవైపే మొగ్గుచూపారు. ఇక్కడి నుంచే రాజకీయాలు సాగించాలనుకుంటోంది. కాగా, ఇటీవల తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ తాను షర్మిలను పార్టీలోకి రానివ్వను అన్నారు. అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన తన మనసు మార్చుకున్నారేమో అనిపిస్తోంది. నిజానికి షర్మిల పొత్తు కోసం ప్రయత్నించింది. కానీ, కాంగ్రెస్ మాత్రం ఆమె పార్టీని విలీనం చేయాలని కోరుకుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో షర్మిల విలీనానికి అంగీకిరించింది అనే ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీ విలీనం, కాంగ్రెస్‌లో చేరిక అంశాలపై ఈ వారంలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.