YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవితవ్యం విషయంలో గందరగోళం నెలకొంది. ఆమె కాంగ్రెస్‌లో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఇటీవలి కాలంలో ఆమె అడుగులు సాగుతున్నాయి. తన సొంత పార్టీ కార్యక్రమాల్ని ఆపేశారు షర్మిల. అంతేకాదు.. గతంలో తను విమర్శించిన రేవంత్ రెడ్డికి అనుకూలంగా ట్వీట్లు కూడా చేసింది. రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
దీంతో ఆమె త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని, అందుకోసమే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నారని, త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరిగింది. చాలా కాలంగా ఈ ప్రచారం సాగుతున్నా.. ఈ అంశంలో ఎలాంటి కదలికా కనిపించడం లేదు. అసలు షర్మిల విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అధిష్టానం కోరింది. దీనికి షర్మిల కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒక దశలో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వాలనుకుంది. కానీ, షర్మిల దీనికి ఆసక్తి చూపలేదు. తెలంగాణ నుంచి పోటీ చేసేందుకే షర్మిల సిద్ధంగా ఉన్నారు. దీంతో షర్మిలను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావించింది. లేదంటే ఆమె ఆశించిన ఆలేరు నుంచి కూడా పోటీ చేయించే ఛాన్స్ ఉంది. ఆలేరులో తనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని సర్వేలో తేలడంతో షర్మిల ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేసింది.
మరోవైపు సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ల ఓట్లు అధికంగా ఉంటాయి. షర్మిల కూడా అదే సామాజికవర్గానికి చెందడంతో ఆమెను అక్కడి నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే, ఈలోపే ఆమెకు జయసుధ నుంచి భారీ షాక్ తగిలింది. బీజేపీలో చేరిన జయసుధ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే జయసుధ కూడా క్రిస్టియన్ వర్గానికి చెందిన నేత కావడంతో షర్మిల సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో షర్మిల తను పోటీ చేసే నియోజకవర్గం ఏదో గుర్తించి, ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తే మంచిది. కాంగ్రెస్‌లో చేరే ఉద్దేశం ఉంటే ఈ పాటికి చేరి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆమెతోపాటు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగిన పొంగులేటి, జూపల్లి వంటి నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. జయసుధ సడెన్‌గా బీజేపీలో చేరిపోయారు.
ఇలా నేతలంతా తమకు నచ్చిన పార్టీలో చేరి, కార్యక్రమాలు చేపడుతుంటే షర్మిల మాత్రం ఇంకా ఈ సంగతి తేల్చకపోవడం పొరపాటే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని, షర్మిల నియోజకవర్గంపై ఫోకస్ చేస్తేనే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి.