YS SHARMILA: షర్మిలను కాంగ్రెస్ లైట్ తీసుకుందా..? ఏపీలోనూ ఛాన్స్ లేదా..?

షర్మిల కోరుకున్న పాలేరు స్థానం నుంచి ఆమెకు టిక్కెట్ ఇస్తారా..? లేదా మరేదైనా స్థానం నుంచి పోటీ చేయమంటారా..? ఏపీ బాధ్యతలు అప్పగిస్తారా..? వంటి అంశాల్లో స్పష్టత కొరవడింది. దీంతో గందరగోళం నెలకొంది. షర్మిల తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసినా స్పందన లేదు.

  • Written By:
  • Publish Date - September 17, 2023 / 01:59 PM IST

YS SHARMILA: వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. షర్మిల విషయంలో ఏం జరుగుతోందో ఇంకా స్పష్టత లేదు. ఇటీవలే కాంగ్రెస్ పెద్దలను కలిసిన షర్మిల, తన పార్టీని త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం చేయాలని భావిస్తోంది. అయితే, కొన్ని అంశాల్లో ఇంకా స్పష్టత రావడం లేదు. షర్మిల కోరుకున్న పాలేరు స్థానం నుంచి ఆమెకు టిక్కెట్ ఇస్తారా..? లేదా మరేదైనా స్థానం నుంచి పోటీ చేయమంటారా..? ఏపీ బాధ్యతలు అప్పగిస్తారా..? వంటి అంశాల్లో స్పష్టత కొరవడింది. దీంతో గందరగోళం నెలకొంది. షర్మిల తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసినా స్పందన లేదు. తన పరిస్థితి అర్థమైన షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయాలని నిర్ణయించుకుంది.

కర్ణాటక సీనియర్ నేత డీకే శివకుమార్‌ ద్వారా కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపింది. దీంతో కాంగ్రెస్‌లో చేరి, తన పార్టీని విలీనం చేయడం దాదాపు ఖాయమే. ఈ విషయం గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీంతో షర్మిల తన పార్టీని విలీనం చేస్తారా.. లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. నిజానికి రేవంత్ రెడ్డి వర్గం షర్మిల రాకను వ్యతిరేకిస్తోంది. ఆమె రాకవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన భావిస్తున్నారు. పైగా నష్టమే అని నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని ఆయన హైకమాండ్‌కు తెలియజేశారు. మరోవైపు ఆమె కోరుతున్న పాలేరు సీటును సీనియర్ నేత తుమ్మల కూడా అడుగుతున్నారు. ఈ ఇద్దరిలో ఇక్కడ లోకల్ అయిన తుమ్మలకే గెలిచే ఛాన్స్‌ ఉంది. అందువల్ల తుమ్మలకే టిక్కెట్ దక్కుతుంది. ఇదే జరిగితే షర్మిల మరోచోటు నుంచి పోటీ చేయాలి. కానీ, ఎక్కడా ఆమెకు సరైన ఆదరణ లేదు. వీటన్నింటినీ అంచనావేసిన అధిష్టానం షర్మిలను తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షర్మిల డిమాండ్లను కాంగ్రెస్ అంగీకరించే అవకాశాలు తక్కువే. ఆమె చేరికవల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదు.
ఏపీలో అవకాశాలు నిల్..
ఈ నేపథ్యంలో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించినా ఈ సారి ప్రయోజనం కనిపించడం లేదు. కారణం.. చంద్రబాబు అరెస్టుతో ఏపీలో రాజకీయం మారిపోయింది. అక్కడ వైసీపీ వర్సెస్ జనసేన, టీడీపీగా మారిపోయింది. కాంగ్రెస్‌ లెక్కలోనే లేదు. షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం శూన్యం. ఆమె ప్రభావం రాబోయే ఎన్నికల్లో అంతంతమాత్రమే. అందువల్ల అటు ఏపీలోనూ షర్మిలకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ పరిస్తితుల్లో ఇటు షర్మిల అడుగులు ఎటువైపు ఉంటాయి..? కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది..? అనేది ఆసక్తికరంగా మారింది.