Telangana Assembly Elections: తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం లోటస్‌పాండ్‌లో పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం తర్వాత తెలంగాణలో పోటీపై షర్మిల ప్రకటన చేసే వీలుంది. షర్మిల రెండేళ్లక్రితం వైఎస్సార్టీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీకి ఎలాంటి ఆదరణాదక్కలేదు. దీంతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలతో అనేక చర్చలు జరిపింది. అయితే, ఈ చర్చల్లో సానుకూల స్పందన రాలేదు.
షర్మిల డిమాండ్లు నెరవేర్చడానికి కాంగ్రెస్ అంగీకరించలేదు. ముఖ్యంగా ఆమె అడిగిన పాలేరు టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. తనతోపాటు కొందరు అనుచరులకు కూడా షర్మిల టిక్కెట్లు అడిగారు. దీనికీ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. మరోవైపు షర్మిల రాకను టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా పలువురు వ్యతిరేకించారు. ఇలా అన్నివైపుల నుంచి షర్మిలకు మొండి చేయి ఎదురైంది. కాంగ్రెస్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది. చివరిదాకా పలు ప్రయత్నాలు చేసినప్పటికీ షర్మిల డిమాండ్లు నెరవేరలేదు. కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియని షర్మిల.. ఒంటరిగానే తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉండబోతున్నారు. ఆమె తన వైఎస్సార్టీపీ తరఫున ఖమ్మం జిల్లాలోని పాలేరు లేదా ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ ప్రధాన కార్యాలయమైన లోటస్‌పాండ్‌లో కార్యవర్గ సమావేశం జరుగుతుంది. దీని తర్వాత ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
దరఖాస్తుల స్వీకరణ
వైఎస్సార్టీపికి తెలంగాణలో ఎక్కడా సరైన అభ్యర్థులు లేరు. అయినప్పటికీ తమ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 12, గురువారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనుంది. మరోవైపు పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై కూడా చర్చలు జరుగుతున్నాయి. పార్టీ కీలక నేతలైన పిట్టా రాంరెడ్డి, తుడి దేవేందర్ రెడ్డి, గడిపల్లి కవతి, సుజాత మంగీలాల్ మేనిఫెస్టోపై చర్చిస్తున్నారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను కూడా పార్టీ ప్రకటించబోతుంది.