YS Sunitha: సునీత రాజకీయ ప్రవేశంపై పోస్టర్లు.. దీని వెనుక కుట్ర దాగి ఉందా?

తన తండ్రి హత్య కేసులో నిందితులెవరో తేల్చాలంటూ సునీత చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలుండటంతో అతడ్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఇది వైసీపీకి మచ్చగా మిగులుతుంది.

  • Written By:
  • Updated On - April 25, 2023 / 04:42 PM IST

YS Sunitha: వైఎస్ వివేకా హత్య కేసు రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ.. జగన్, అవినాష్ రెడ్డి వర్సెస్ సునీత అన్నట్లు తయారైంది. తన తండ్రి హత్య కేసులో నిందితులెవరో తేల్చాలంటూ సునీత చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలుండటంతో అతడ్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఇది వైసీపీకి మచ్చగా మిగులుతుంది. అందుకే దీనంతటికీ కారణమైన సునీతపై వైసీపీ ఇప్పుడు కుట్రకు తెరతీసినట్లే కనిపిస్తోంది. అందుకే ఆమె టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. చివరకు పోస్టర్ల వరకూ వెళ్లింది వ్యవహారం.

వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరులో సునీతకు సంబంధించిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సునీత టీడీపీలో చేరబోతున్నట్లు ఈ పోస్టర్లలో ఉంది. సునీత, ఆమె తండ్రి వైఎస్ వివేకా ఫొటోలతోపాటు చంద్రబాబు నాయుడు, లోకేష్, బీటెక్ రవి, శ్రీనివాసులు రెడ్డి, అచ్చెన్నాయుడు ఫొటోలు కూడా పోస్టర్లలో ఉన్నాయి. ఇందులో జై తెలుగు దేశం.. రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న డా.వైఎస్.సునీతమ్మకు స్వాగతం అని రాసుంది. అంటే వైఎస్ సునీత టీడీపీలో చేరబోతున్నారు అనేది ఈ పోస్టర్ల సారాంశం. మంగళవారం ఉదయంకల్లా ఈ పోస్టర్లు ప్రొద్దుటూర్ నగరమంతా కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. దీంతో స్థానికంగా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.

కానీ, ఈ పోస్టర్లను వైసీపీ శ్రేణులే అంటించాయని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. సునీత టీడీపీలో చేరుతారని వైసీపీ శ్రేణులు ఎప్పట్నుంచో ప్రచారం చేస్తున్నాయి. సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఇటీవల అదే మాట చెప్పారు. ఇందుకోసం ఆమె టీడీపీ పెద్దలను కూడా కలిసినట్లు ఆయన వెల్లడించాడు. ఈ వార్తలను సునీత ఖండించలేదు. తాను టీడీపీలో చేరబోతున్నట్లు లేదా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, వైసీపీ శ్రేణులు మాత్రం ఈ విషయంపై గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. సునీతకు వ్యతిరేకంగా కొంతకాలంగా వైసీపీ మీడియా కూడా అనేక కథనాలు ప్రసారం చేసింది. ముఖ్యంగా సునీత టీడీపీ ట్రాప్‌లో పడ్డారని, వాళ్లు చెప్పినట్లే సునీత నడుచుకుంటున్నారని వైసీపీ ఆరోపించింది. అందుకే అవినాష్ రెడ్డి లక్ష్యంగా విచారణ జరిగేలా చూశారని సజ్జలసహా పలువురు ఆరోపించారు.


సునీతపై ఎందుకీ కక్ష!
వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరింది ఆయన కూతురు సునీత. అప్పట్నుంచి కేసు విచారణ మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కేసు నడుస్తోంది. దీంతో వైసీపీ శ్రేణులు ఈ విషయంలో సునీతపై కక్ష పెంచుకున్నాయి. అవినాష్ రెడ్డికి జగన్ సహా వైసీపీ శ్రేణులు అండగా నిలుస్తూ వచ్చినప్పటికీ, ఆయనకు వ్యతిరేకంగా సాక్షాలు ఉండటం వల్ల ఆయన అరెస్టు ఖాయంగా కనిపిస్తోంది. జగన్‌కు వరుసకు సోదరుడు, వైసీపీ ఎంపీ అయిన అవినాష్ రెడ్డి అరెస్టైతే ఆ పార్టీకి, జగన్ రాజకీయానికి ఇదొక మచ్చగా ఉంటుంది. అందుకే ఈ విషయంలో సునీతను వీలైనంత వరకు దోషిగా నిలబెట్టేందుకు వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే సునీత టీడీపీలో చేరబోతున్నట్లు పోస్టర్లు అంటించారని ప్రచారం జరుగుతోంది. లేక నిజంగానే ఆమె టీడీపీలో చేరుతారా అనేది తెలియాలి.
టీడీపీతో లింకు
తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో సునీత వ్యవహారశైలిని ఆది నుంచి వైసీపీ తప్పుబడుతోంది. ఆమె టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. తన తండ్రి హత్యలో న్యాయం జరగాలని కోరుకునే హక్కు సునీతకు లేదా? అలా పోరాడితే ఇతర పార్టీలతో లింకు పెట్టేస్తారా? వైసీపీ రాజకీయం అలాగే ఉంటుంది. అవసరమైతే ప్రత్యర్థులపై ఎలాంటి బురదైనా చల్లేందుకు ఆ పార్టీ నేతలు వెనుకాడరు. హత్యలో నిజానిజాలు తేలుతాయి. సునీత తండ్రి కోసం పోరాడుతోంది. ఇందులో అవినాష్ రెడ్డిని దోషిగా అనుమానిస్తోంది. అయితే, మధ్యలో వైసీపీకి ఏం సంబంధం. అవినాష్ రెడ్డి దోషిగా తేలితే, కేసు ముగుస్తుంది. లేదూ అంటే విచారణ ఇంకా కొనసాగుతుంది. అసలు దోషులెవరో తేలుతుంది. ఇది పార్టీలకు సంబంధించిన రాజకీయ అంశం కాదు కదా. మరి వైసీపీ ఎందుకంత ఉలిక్కిపడుతున్నట్లు. ఒకవేళ అవినాష్ రెడ్డి నిందితుడిగా తేలితే ఇంకేమైనా రహస్యాలు బయటకొస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయా? సునీతకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? ఈ కేసులో వైఎస్ భారతి పేరు రాగానే ఒక మహిళను వివాదంలోకి లాగుతారా.. ఆమె పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తారా అంటూ వాదిస్తున్న వైసీపీ శ్రేణులు సునీత కూడా ఒక మహిళే అనే విషయాన్ని ఎందుకు గుర్తించరు? ఏదేమైనా వివేకా హత్య కేసు.. సునీత వ్యవహారం ఇంకా ఎంతకాల కొనసాగుతుందో చూడాలి.