YS Sunitha Reddy: పులివెందుల బరిలో వైఎస్‌ సునీతా రెడ్డి.. చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్‌ అదేనా ?

ఏపీ రాజకీయాల్లో వివేకా హత్య కేసు రేపుతున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్‌ ఖాయం అని ప్రచారం మొదలైపోయింది కూడా ! కడప సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాశ్‌ రెడ్డి అరెస్ట్ జరిగితే.. వైఎస్‌ కుటుంబానికి అది భారీ దెబ్బగా మారుతోంది. నిజానికి కడప జిల్లా అనేది వైఎస్‌ కుటుంబానికి కంచుకోట. జగన్ పార్టీకి అధినేత అయినా.. సీఎం అయినా.. కడప జిల్లా వైసీపీ బాధ్యత అంతా వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డిదే ! అలాంటి ఇద్దరు అరెస్ట్ అయితే ఆ కుటుంబానికి దెబ్బ తప్పదు.

  • Written By:
  • Publish Date - May 3, 2023 / 02:02 PM IST

అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని ప్రచారం జరుగుతున్న సమయంలో.. టీడీపీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని కొట్టాలన్నది చంద్రబాబుకు ఎప్పటి నుంచో కల. ఐతే ఆ కల నిజం అయ్యేందుకు కాసిన్ని ఆశలు కనిపిస్తున్నాయ్ ఇప్పుడు ! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఫిక్స్ అయి.. తన మార్క్ స్ట్రాటజీలను సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. వివేకా హత్య కేసులో జగన్ అండ్‌ కో పాత్ర ఉందని జనాలు నమ్ముతున్నారని ఫిక్స్ అయిన చంద్రబాబు.. ఆ కుటుంబంలో విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా పులివెందులలో సత్తా చాటాలని ఫిక్స్ అవుతున్నారు. బీటెక్ రవి ఇప్పటికే యాక్టివ్ అయ్యారు.. ఇంక బ్యాలెన్స్ ఏమైనా ఉంది అంటే.. అది స్ట్రాటజీలను అమలులో పెట్టడమే ! ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది అదే ! కడప ఎంపీ, పులివెందుల అసెంబ్లీ సీట్లు ఇప్పుడు గెలవకపోతే.. ఇంకెప్పుడు గెలవలేమని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నారు.

కడప ఎంపీ సంగతి ఎలా ఉన్నా.. పులివెందుల అసెంబ్లీ విజయం కోసం వైఎస్‌ కుటుంబంలో వ్యక్తినే ఆయుధంగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. సునీతా రెడ్డిని ఇండిపెండెంట్‌గా బరిలోకి దించి.. వెనకాల నుంచి చక్రం తిప్పాలని భావిస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. వివేకా హత్య కేసు తర్వాత.. సునీతా రెడ్డి మీద జనాల్లో సానుభూతి కనిపిస్తోంది. దీనికితోడు వివేకా కేరక్టర్‌ను దెబ్బతీసేలా అవినాశ్‌ రెడ్డి, వైఎస్‌ కుటుంబం కుట్రలు చేసిందని.. సునీతారెడ్డిని ఒంటరి చేసి ఇబ్బంది పెట్టారనే ప్రచారం.. జనాల్లోకి భారీగా వెళ్లిపోయింది. దీన్నే టీడీపీ ఆయుధంగా మార్చుకోబోతోందనే చర్చ జరుగుతోంది.

సునీతా రెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగితే.. ఆమెకు మద్దతుగా నిలిస్తే.. జగన్‌కు ఝలక్ ఇవ్వడం ఖాయం అన్నది సైకిల్ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. పైగా సునీతారెడ్డి భర్త, టీడీపీ అభ్యర్తి బీటెక్‌ రవి మంచి స్నేహితులు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని సునీతారెడ్డి చెప్తున్నా.. ఆమె భర్త మాత్రం అలాంటిదేమీ లేదని చెప్తున్నారు. అంటే సునీతారెడ్డిని ఎలాగోలా ఒప్పించి బరిలోకి దింపడం ఖాయం. అదే జరిగితే.. ఆ పరిణామం వైసీపీని మరింత ఇబ్బంది పెడుతుందని పసుపు పార్టీ నేతలు ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు.

సునీతా రెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే.. వైఎస్‌ ఫ్యామిలీ ఓటు బ్యాంక్‌ చీలిపోయి.. అది తమ పార్టీకి భారీ ప్లస్ అవుతుందని చంద్రబాబు అండ్ కో అంచనాలు వేస్తోంది. వివేకా హత్య కేసును కడప జిల్లా జనాలు ఇంకా మర్చిపోలేదు. ఇలాంటి సమయంలో అవినాశ్‌ రెడ్డి అరెస్ట్ అయితే… వైఎస్‌ సునీతారెడ్డి బరిలోకి దిగితే.. వైసీపీకి షాక్‌ తగలడం ఖాయం. ఇదే పరిణామాన్ని పక్కాగా వాడుకోవాలని చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. పులివెందులలో వైఎస్ కుటుంబానికి ప్రతీసారి లక్షకు అటు ఇటుగా మెజారిటీ వస్తుంది. అలాంటి చోట గెలవడం కాదు.. ఓడించినంత పని చేస్తే చాలు.. గెలిచినట్లే అని టీడీపీ ప్లాన్. కర్తవ్యం వేరు.. కోరిక వేరు.. పులివెందులలో గెలవాలన్నది ఇన్నాళ్లు కోరికే.. ఇప్పుడో పరిణామం ఆయుధంగా తయారయింది. అది కర్తవ్యంగా మారింది. మరి ఆ కర్తవ్యాన్ని సైకిల్ పార్టీ ఏ మేరకు పూర్తి చేస్తుందన్నది మరింత ఆసక్తికరంగా మారింది.