YS Viveka Case: కోడి కత్తి కేసు తేలదు.. వివేకా హత్య కేసు వీడదు..!?

రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసుతోపాటు వివేకా హత్య కేసు ఎటూ తేలడం లేదు. అందరికీ అన్నీ తెలుసు. కానీ, న్యాయమే జరగదు. వివేకాది హత్య అని అందరికీ తెలుసు. ఈ కేసులో పాత్రధారుల గురించి అవగాహన ఉంది. కానీ, సీబీఐ కూడా ఈ కేసును ఇప్పటికీ పరిష్కరించలేకపోతోంది.

  • Written By:
  • Updated On - April 18, 2023 / 01:58 PM IST

YS Viveka Case: ఏపీలో రెండు హై ప్రొఫైల్ కేసులు నాలుగేళ్లుగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకటి కోడి కత్తి కేసు.. రెండోది వివేకా హత్య కేసు. రాష్ట్రంలో అత్యంత సంచలనం సృష్టించిన ఈ రెండు కేసులు ఎటూ తేలడం లేదు. అందరికీ అన్నీ తెలుసు. కానీ, న్యాయమే జరగదు. వివేకాది హత్య అని అందరికీ తెలుసు. ఈ కేసులో పాత్రధారుల గురించి అవగాహన ఉంది. కానీ, సీబీఐ కూడా ఈ కేసును ఇప్పటికీ పరిష్కరించలేకపోతోంది. ఇక కోడి కత్తి కేసు కూడా అంతే. జగన్‌పై హత్యాయత్నంగా నమోదైన ఈ కేసు ఇంకా ఏమీ తేలకుండానే మిగిలిపోయింది. అసలు ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ కేసుల విషయంలో రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి.
కోడి కత్తి ఘటన జరిగి నాలుగేళ్లు పూర్తైంది. 2018 అక్టోబర్ 25న అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. శ్రీనివాసరావు అలియాస్ కోడి కత్తి శీను అనే వ్యక్తి కోడి కత్తితో జగన్ భుజంపై దాడి చేశాడు. ఈ ఘటనలో జగన్‌కు గాయమైంది. అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే శీనును అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. రాజకీయంగా పెను దుమారం రేపింది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. తనను చంపేందుకు టీడీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. దీని ద్వారా ఆయనపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమైంది. అది ఎన్నికల్లో జగన్ విజయానికి దోహద పడింది. చివరకు జగన్ సీఎం అయ్యారు. అయితే, కేసు సంగతేంటి? అప్పట్నుంచి జైలులోనే ఉంటున్న శీను పరిస్థితి ఏంటి? ఈ కేసు విచారణ పూర్తైతేనే కదా.. శీను చేసిన నేర తీవ్రత ఎంత.. దీనికి అతడికి ఎంతకాలం శిక్ష పడాలి? ఎప్పుడు విడుదలవ్వాలి? తేలేది. దీని వెనుక ఉన్నదెవరో తేల్చేది? కానీ, ఇదే జరగడం లేదు ఈ కేసులో.
సాక్ష్యం చెప్పేందుకు రాని జగన్
ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ కేసులో బాధితుడు, ప్రత్యక్ష సాక్షి జగన్. కానీ, ఇంతవరకు ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు జగన్ ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లలేకపోవడం విడ్డూరం. జగన్ సాక్ష్యం చెబితేనే కదా.. కేసు ముందుకు కదిలేది. ఆయన తరచూ ఏదో ఒక కారణం చెప్పి కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నారు. అప్పట్లో ఈ ఘటనను టీడీపికి ఆపాదించింది వైసీపీ. అయితే, ఇందులో టీడీపీ పాత్ర ఏమీ లేదని, ఈ ఘటనలో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ తేల్చింది. వైసీపీ, జగన్ తరఫు న్యాయవాదులు ఆరోపించినట్లు అక్కడి రెస్టారెంట్ యజమానికి, టీడీపీకి సంబంధం లేదని తేల్చింది.

రెస్టారెంట్ యజమాని పేరు హర్షవర్దన్ అయితే, హర్షవర్ధన్ చౌదరి అని ఆరోపించారని ఎన్ఐఏ పేర్కొంది. ఘటన జరిగిన సమయంలో సీసీ కెమెరాలు పని చేయలేదన్న వైసీపీ వాదన అబద్ధమని కూడా ఎన్ఐఏ నిర్ధరించింది. ఈ సమయంలో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని చెప్పింది. మొత్తంగా అప్పట్లో వైసీపీ చేసిన ప్రచారంలో నిజం లేదని తేలింది. అయితే, జగన్ కోర్టుకు హాజరుకాకపోవడం, కేసు విచారణ సాగదీసేందుకే ఆయన తరఫు లాయర్లు ప్రయత్నించడం వంటి కారణాలతో నాలుగేళ్లు పూర్తైనా కేసు ఇంకా కొలిక్కిరావడం లేదు. కేసు విచారణ ఇంకా సాగుతూనే ఉంది.


మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు పూర్తైంది. మార్చి 15, 2019న వివేకా హత్యకు గురయ్యారు. ముందుగా గుండెపోటుతో వివేకా హత్యకు గురయ్యారని ప్రచారం జరిగింది. తర్వాత ఇది హత్య అని తేలింది. అనేక వివాదాల మధ్య హత్య కేసు సీబీఐకి బదిలీ అయింది. తర్వాత కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేశారు. ఈ హత్య కేసులో కూడా టీడీపీ ప్రమేయం ఉందని అప్పట్లో జగన్, వైసీపీ ఆరోపించాయి. కానీ, ఇప్పుడు హత్యలో జగన్ సన్నిహితులు, వైఎస్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు తేలడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికి ఐదుగురిని అరెస్టు చేసింది. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది.

అనేక మందిని విచారించిన సీబీఐ ఇంకా కేసును కొలిక్కి తీసుకురాలేకపోతోంది. కేసు విచారణలో అనేక లోపాలున్నాయని నిందితుల తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. సీబీఐపైనే అవినాష్ రెడ్డి, వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఉద్దేశం ప్రకారమే సీబీఐ పని చేస్తోందని, వాస్తవాల్ని దాచి పెట్టి, తమకు అవసరమైన కోణంలోనే విచారిస్తోందని వాళ్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ కేసు విచారణ కూడా ఇప్పుడప్పుడే తేలే అవకాశం కనిపించడం లేదు. నాలుగేళ్లుగా అటు కోడి కత్తి కేసు.. ఇటు వివేకా హత్య కేసు ఇంకా విచారణ దశలోనే ఉండటం మాత్రం రాజకీయాలకు వేదికగా మారుతున్నాయి.