YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు.. రెండుగా చీలిన వైఎస్ కుటుంబం.. జగన్‌కు షాక్ ఇస్తున్న షర్మిల

వివేకా హత్యకు ఆస్తి తగాదాలే కారణమని అవినాష్ రెడ్డి ఆరోపిస్తుంటే.. అసలు ఆస్తి గొడవలే లేవని షర్మిల చెప్పారు. దీంతో అవినాష్ రెడ్డి వాదనలకు వ్యతిరేకంగా వ్యవహారం సాగుతోంది. ఈ కేసులో జగన్ ఒకవైపు.. ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మరోవైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

  • Written By:
  • Updated On - April 26, 2023 / 07:35 PM IST

YS Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం రెండుగా చీలినట్లు కనిపిస్తోంది. వైఎస్ జగన్, సజ్జల అవినాష్ రెడ్డికి మద్దతుగా నిలబడుతుంటే.. వివేకా కూతురు సునీతకు వైఎస్ షర్మిల, విజయమ్మ అండగా నిలుస్తున్నారు. ఈ హత్యపై కుటుంబంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వివేకా హత్యకు ఆస్తి తగాదాలే కారణమని అవినాష్ రెడ్డి ఆరోపిస్తుంటే.. అసలు ఆస్తి గొడవలే లేవని షర్మిల చెప్పారు. దీంతో అవినాష్ రెడ్డి వాదనలకు వ్యతిరేకంగా వ్యవహారం సాగుతోంది. ఈ కేసులో జగన్ ఒకవైపు.. ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మరోవైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే వీరి మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని, దూరాన్ని వివేకా హత్య మరింత పెంచినట్లే కనిపిస్తోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. సీబీఐ ఈ కేసులో దూకుడు ప్రదర్శిస్తోంది. ఏ క్షణమైనా వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి అరెస్టు తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరగా గురువారం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జరగబోతుంది. ఇందులో గనుక ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు. అయితే, అతడికి వైఎస్ జగన్, ఆయన బంధువు సజ్జల, ఇతర కడప నేతలు మద్దతిస్తున్నారు. వివేకా హత్యకు, అవినాష్ రెడ్డికి సంబంధం లేదని వాదించారు. సునీతకే సంబంధం ఉండొచ్చంటూ అనేక అంశాల్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ వాదనల్ని జనం పెద్దగా నమ్మడం లేదు. సునీతకే మద్దతు లభిస్తోంది. చివరకు వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా సునీతకు మద్దతుగా మాట్లాడుతున్నారు.
జగన్‌కు షాక్
వైఎస్ వివేకా హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసును టీడీపీకి ఆపాదించేందుకు అప్పట్లో జగన్ అండ్ కో, ఆయన మీడియా తెగ ప్రయత్నించాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ హత్య జరగడంతో దీనికి చంద్రబాబు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ డిమాండ్ చేశారు. కొద్ది రోజులకే జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి కడప నుంచి ఎంపీగా గెలిచారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణకు జగన్ అడ్డుపడ్డారు. కానీ, వివేకా కూతురు సునీత పట్టుబట్టి ఈ కేసు విచారణ సీబీఐ చేపట్టేలా చేశారు. ఇదే జగన్‌కు ఒక షాక్. ఈ కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయంపై ప్రచారం జరిగింది. దీన్ని జగన్ తనదైన శైలిలో ఖండించారు.

అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరూ తన కుటుంబ సభ్యులే అని.. ఒక కన్ను మరో కన్నును ఎలా పొడుస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చారు. అతడు అలాంటివాడు కాదని చెప్పుకొచ్చారు. ఇదంతా టీడీపీ ఆడుతున్న నాటకం అని విమర్శించారు. రోజులు గడిచాయి. ఈ కేసులో అన్ని వేళ్లూ అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. సీబీఐకి ఈ విషయంలో బలమైన ఆధారాలు లభించాయి. అప్పటికీ జగన్, సజ్జల అండ్ కో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరకు సీబీఐ విచారణనే తప్పుబట్టారు. ఒక పథకం ప్రకారమే తమపై కుట్ర జరుగుతోందన్నారు. ఈ విషయంలో ఎంతగా అతడిని సమర్ధిస్తూ వచ్చినా లాభం లేకుండా పోయింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే వరకు కేసు వచ్చింది. ఇంతకాలం జగన్ అండ్ కో, అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఇప్పుడు వైఎస్ కుటుంబ సభ్యులే స్పందించడం విశేషం. ఇది కచ్చితంగా జగన్‌కు మరో షాకే.


సునీతపైనే ఆరోపణలు
వివేకా హత్య కేసుతో తనకేం సంబంధం లేదని అవినాష్ రెడ్డి చెప్పాడు. వివేకా రెండో భార్య, పిల్లల విషయాన్ని బయటపెట్టాడు. ఆస్తి కోసం సునీత తరఫువాళ్లే హత్య చేసి ఉండొచ్చని చెప్పాడు. ఆస్తి గొడవలు, రెండో వివాహం వంటి అంశాలే కారణమని చెబుతూ వచ్చాడు. దీనివల్ల వివేకా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కూడా అతడు వెనుకాడలేదు. కేసులో తనను ఇరికేంచేందుకు సునీత ప్రయత్నిస్తోందన్నాడు. సీబీఐపై కూడా ఆరోపణలు చేశాడు. టీడీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారు. సానుభూతి పొందేందుకు యత్నించారు. కానీ, ఈ ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. అరెస్టు తప్పించుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కినా లాభం లేకపోయింది. గురువారం అతడి బెయిల్‌పై తీర్పు వెలువడే అవకాశం ఉంది.


సునీతకు మద్దతుగా షర్మిల
సునీతకు వ్యతిరేకంగా జగన్ అండ్ కో ప్రచారం చేస్తుంటే.. ఆమెకు తన చెల్లి అయిన షర్మిల మద్దతు తెలిపింది. గతంలో విజయమ్మ కూడా షర్మిలవైపే మొగ్గు చూపింది. వివేకా హత్యకు ఆస్తి గొడవలే కారణమంటూ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని షర్మిల ఖండించింది. “వైఎస్ వివేకా ప్రజల మనిషి. అసలు కుటుంబంలో ఆస్తి గొడవలే లేవు. వివేకా తన ఆస్తులన్నీ సునీత పేరు మీద ఎప్పుడో వీలునామా చేశారు. ఆయన పేరు మీద ఆస్తులే లేనప్పుడు వాటి కోసం హత్య ఎవరు చేస్తారు? వివేకా వ్యక్తిగత జీవితాన్ని తక్కువ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పులివెందుల, కడప జిల్లా ప్రజలకు వివేకా గురించి తెలుసు. చనిపోయిన వ్యక్తిపై విషప్రచారం చేస్తున్నారు” అని షర్మిల వ్యాఖ్యానించారు. దీంతో అవినాష్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కుటుంబం నుంచే వ్యతిరేకత రావడం చర్చనీయాంశం అవుతోంది.

రెండుగా చీలిన కుటుంబం
వైఎస్ జగన్‌కు, ఆయన తల్లి విజయమ్మకు, చెల్లి షర్మిలకు మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. జగన్, షర్మిల చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. కొంతకాలంగా రెండు కుటుంబాలు కలుసుకున్నది కూడా లేదు. ఆస్తుల విషయంలోనేకాకుండా, రాజకీయంగా వీరి మధ్య వైరం ఉందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు వివేకా హత్య కేసులో కూడా వీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయంలోనూ వైఎస్ కుటుంబం రెండుగా చీలినట్లు స్పష్టమవుతోంది. ఇంకా ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.