YS Vivekananda Case: జగన్, భారతి మెడకు వివేకా హత్య కేసు.. జగన్ విచారణ తప్పదా..?

వివేకా మరణ వార్తను ముందుగా జగన్‌కు చెప్పిందెవరు అనే అంశం చుట్టూ ప్రస్తుతం వివాదం నడుస్తోంది. గతంలో ఈ అంశంపై సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన అజేయ కల్లాం రెడ్డి.. తను చెప్పని మాటల్ని చెప్పినట్లు సీబీఐ ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 03:33 PM IST

YS Vivekananda Case: వైఎస్ వివేకానంద హత్య కేసులో ఉన్నన్ని సంచలనాలు అన్నీఇన్నీ కావు. విచారణ సాగుతున్నకొద్దీ కీలక వ్యక్తుల పేర్లు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో ఏపీ సీఎం జగన్ పేరు, ఆయన సతీమణి వైఎస్ భారతి పేరు కూడా ఉండటం మరింత సంచలనంగా మారింది. వివేకా మరణ వార్తను ముందుగా జగన్‌కు చెప్పిందెవరు అనే అంశం చుట్టూ ప్రస్తుతం వివాదం నడుస్తోంది. గతంలో ఈ అంశంపై సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన అజేయ కల్లాం రెడ్డి.. తను చెప్పని మాటల్ని చెప్పినట్లు సీబీఐ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అంతేకాదు.. తాను చెప్పినట్లు చెబుతున్న మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.

అజేయ కల్లాం గతంలో సీబీఐకి ఇచ్చినట్లు చెబుతున్న వివరాల ప్రకారం.. హత్య జరిగిన సమయంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌తో ముగ్గురు భేటీ అయ్యారు. జగన్ ఓస్డీగా ఉన్నకృష్ణమోహన్‌ రెడ్డి, సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అజేయ కల్లం రెడ్డి అప్పుడు జగన్‌తో ఉన్నారు. వీరిని వివేకా కేసులో సీబీఐ విచారించింది. అయితే, ఒకే ప్రశ్నకు ముగ్గురూ.. మూడు విభిన్న సమాధానాలు చెప్పారు. అందులో అజేయ కల్లాం ఇచ్చిన వాంగ్మూలంపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఆయన తన వాంగ్మూలంలో వైఎస్ భారతి పేరు ప్రస్తావించారు. ‘‘హత్య జరిగిన రోజు తెల్లవారుఝామున ఐదు గంటలకే జగన్‌తో సమావేశమయ్యాం. కృష్ణమోహన్‌రెడ్డి, డి కృష్ణ, సాంబశివారెడ్డితో కలిసి నేను ఆ మీటింగులో పాల్గొన్నాను. సమావేశం జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక అటెండెంట్ వచ్చి, జగన్‌ను భారతి పిలుస్తున్నారని చెప్పారు. ఆయన వెంటనే వెళ్లి.. కొద్దిసేపటికి తిరిగొచ్చారు. అప్పుడు వైఎస్ వివేకా ఇక లేరని చెప్పారు. ఆ విషయం తెలిసి షాకయ్యాం. వెంటనే కడప వెళ్లాల్సిందిగా జగన్‌కు సూచించి బయటకు వచ్చేశాం’’ అని అజేయ కల్లాం వాంగ్మూలంలో చెప్పారు. అంటే వివేకా హత్య విషయం ప్రపంచానికి తెలియకముందే జగన్‌కు, భారతికి తెలిసిందని ఆయన చెప్పినట్లైంది. ఇప్పుడు అజేయ కల్లాం ఇచ్చిన వాంగ్మూలం బయటపడటంతో ఆయన దానిని ఖండించారు. అది కూడా ఈ వివరాలు బయటకు వచ్చిన వారం రోజుల తర్వాత.. తాను అలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, తాను జగన్ భార్య పేరు ప్రస్తావించలేదని చెప్పారు. కేసును తప్పుదోవపట్టించేందుకు, ఇతరులను కేసులో ఇరికించేందుకే సీబీఐ ఇలా చేసిందంటూ వాదిస్తున్నారు. తన వాంగ్మూలాన్ని తొలగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నో అనుమానాలు..?
అజేయ కల్లాం మాట మార్చడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వాటిని డాక్యుమెంట్ చేసి, ఆ డాక్యుమెంట్‌పై సంబంధిత సాక్షి సంతకం తీసుకుంటారు. అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన వ్యక్తి.. సంతకం చేసే ముందు ఆమాత్రం చూసుకోలేదా.. ఒకసారి వాంగ్మూలం ఇచ్చి, ఇప్పుడు మాట మార్చడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. ఈ కేసు విచారణకు వైఎస్ జగన్‌తోపాటు, ఆయన భార్య భారతి కూడా హాజరుకావాల్సి ఉంటుంది. అయితే, వైసీపీ పెద్దల నుంచి వచ్చిన సూచన మేరకే అజేయ కల్లాం తన వాంగ్మూలం తప్పని కేసు వేసి ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. అందులోనూ ఈ స్టేట్‌మెంట్ బయటకు వచ్చిన వారం తర్వాత వాటిని ఖండించడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్, భారతిని సీబీఐ విచారణ నుంచి తప్పించడానికే ఇలా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.