YCP – Prakasam: ప్రకాశం వైసీపీకి మరో నెల్లూరులా తయారవుతోందా…?

నెల్లూరు జిల్లాలో నేతల కుమ్ములాటపై పార్టీ హైకమాండ్‌కు సమాచారం ఉన్నా దాన్ని లైట్ తీసుకున్నారు. సలహాదారుల మాటలకే సీఎం విలువ ఇచ్చారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఏకంగా ముగ్గురు జిల్లా ఎమ్మెల్యేలు హ్యాండిచ్చారు. ఇప్పుడు ప్రకాశంను వదిలేస్తే అలాగే జరుగుతుందని సీఎంకు క్లారిటీ రావడంతో ముందు జాగ్రత్త పడుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 09:32 PM IST

ఏపీ సీఎం జగన్‌కు ఇప్పుడు జిల్లాల కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. మరిన్ని జిల్లాల్లో నెల్లూరు తరహా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయన్న సమాచారంతో పార్టీ హైకమాండ్‌ టెన్షన్‌ పడుతోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పరిస్థితి చేయిజారిపోతోందన్న అనుమానాలు బాలినేని ఎపిసోడ్‌తో పార్టీలో మొదలయ్యాయి. దీంతో ప్రకాశంలో ఫ్యాన్‌కు రిపేర్ చేసే పనిలో పడ్డారు జగన్…

ప్రకాశం జిల్లాలో పార్టీ నేతలపై వైసీపీ హైకమాండ్‌ దృష్టి సారించింది. జిల్లాలోని వైసీపీ నేతలపై ఐ ప్యాక్ టీం నిఘా పెట్టిందన్న అనుమానాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు… ఎవరెవరిని కలుస్తున్నారు…? వంటి వివరాలు ఆరా తీస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన సమీప బంధువు, ప్రకాశం జిల్లా కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం తర్వాత ఈ పరిణామాలన్నీ చకచకా జరుగుతుండటంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పార్టీ నేతల్లో నెలకొంది.

ముఖ్యమంత్రి జగన్‌తో బాలినేని సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. తనపై జరుగుతున్న కుట్రను వివరించడంతో పాటు పలు వాస్తవాలను ఆయన సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇలాగే ఉంటే ప్రకాశం జిల్లాలో పార్టీకి ఓటమి తప్పదని ఆయన సీఎంను హెచ్చరించారట. ఇప్పుడే జోక్యం చేసుకోకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని ఆ తర్వాత ఏం చేసినా ఉపయోగం ఉండదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారట. కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో… నేతలు ఏం చేస్తున్నారో… పార్టీ పరిస్థితేంటో ఆయన స్పష్టంగా వివరించారట. అంతెందుకు తాను కూడా గెలుస్తానో లేదో తెలియదన్నారట బాలినేని. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పోటీపోటీ తప్పదన్న అంచనాల సమయంలో ప్రతి సీటూ కీలకమే. అలాంటి చోట ఇప్పట్నుంచే జాగ్రత్తపడకపోతే జిల్లాపై ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు బాలినేని.

బాలినేని మాటలను సీఎం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని కేవలం నేతల పంచాయితీగా కాకుండా అంతకుమించిన సమస్యగా చూడాలని ఆయనకు అర్ధమైంది. వెంటనే జిల్లా పరిణామాలపై ఆయన ఓ నివేదిక తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. ఇలాగే వదిలేస్తే ప్రకాశం జిల్లా కూడా మరో నెల్లూరు జిల్లాలాగా మారుతుందన్న అంచనాకు వచ్చిన ఆయన ఐప్యాక్‌ను సీన్‌లోకి తీసుకొచ్చారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆయన క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తున్నారు. రహస్యంగా సాగుతున్న ఈ సర్వే గురించి పార్టీ నేతలకు కూడా పూర్తి సమాచారం ఇవ్వలేదు. ఉన్నది ఉన్నట్లుగా తనకు చెప్పాలని సీఎం ఆదేశించడంతో ఐప్యాక్ కూడా దాన్ని సీరియస్‌గా తీసుకుంది. సాధారణంగా ఐప్యాక్‌ బృందాలు ఆ ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు, ద్వితీయ స్థాయి నేతలతో సమావేశమై నివేదికలు సీఎంకు అందిస్తాయి. అయితే ఇక్కడ మాత్రం స్టేట్‌ ఐప్యాక్‌ టీమ్‌ సీన్‌లోకి ఎంటరైంది. జిల్లా టీమ్‌ల నివేదికలను క్రాస్‌చెక్‌ చేసి పూర్తిస్థాయి నివేదికలను వారు సీఎంకు పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక నివేదికలో బాలినేని చెప్పింది వాస్తవమనే సమాచారం సీఎంకు అందినట్లు తెలుస్తోంది. ఐప్యాక్‌ టీమ్‌ పనిలో పనిగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతల జాబితాను కూడా సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.

సీఎం ఫోకస్‌ వైసీపీ జిల్లా నేతలను కలవరపెడుతోంది. ఎవరి గురించి ఎలాంటి నివేదిక సీఎంను చేరుతుందోనన్న టెన్షన్‌ వారిలో నెలకొంది. కొన్నిచోట్ల నేతల మధ్య టికెట్ల కోసం పెద్ద పంచాయితీనే నడుస్తోంది. పార్టీలోని ప్రత్యర్ధులతో ఎమ్మెల్యేలకు తలనొప్పులు తప్పడం లేదు. ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తమ కొంప ముంచుతాయోనని కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారని సమాచారం. బాలినేని తమ గురించి ఏమైనా చెప్పుంటారా అన్నది కూడా కొందరిని వేధిస్తోంది. అయితే వారు ఆ విషయాన్ని నేరుగా బాలినేనిని అడగలేక అలాగని దాన్ని లైట్ తీసుకోలేక తెగ సతమతమవుతున్నారట. నెల్లూరు జిల్లాలో నేతల కుమ్ములాటపై పార్టీ హైకమాండ్‌కు సమాచారం ఉన్నా దాన్ని లైట్ తీసుకున్నారు. సలహాదారుల మాటలకే సీఎం విలువ ఇచ్చారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఏకంగా ముగ్గురు జిల్లా ఎమ్మెల్యేలు హ్యాండిచ్చారు. ఇప్పుడు ప్రకాశంను వదిలేస్తే అలాగే జరుగుతుందని సీఎంకు క్లారిటీ రావడంతో ముందు జాగ్రత్త పడుతున్నారు. మరి ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయిందా లేక రిపేర్‌తో ఫ్యాన్‌ స్పీడందుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.