Balineni Srinivasa Reddy: ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి.. వైసీపీ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చింది. ఆయన ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఐతే వీరిని సస్పెండ్ చేస్తున్న విషయం తనకు ఏమాత్రం చెప్పకుండా.. సస్పెండ్ చేయడంపై బాలినేని అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. 48 గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కొద్ది నెలలుగా పార్టీ అధిష్టానంపై బాలినేని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలినేనికి.. ఆ తర్వాత ఉద్వాసన పలికారు. తర్వాత పార్టీ బాధ్యతలను అప్పగించారు. కొన్ని సమయాల్లో తప్ప పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉన్న బాలినేని.. ఉన్నట్టుండి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈమధ్యకాలంలో ఆయనకు వైసీపీలో ప్రాధాన్యం దక్కడం లేదు. ప్రోటోకాల్ కూడా లభించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకే చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్‌తో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తనను తొలగించి ఆయనను మంత్రిగా కొనసాగించడంపై.. బాలినేని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీనికితోడు పార్టీ వ్యవహారాల్లో అసలు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని.. కొద్దినెలలుగా ఫీల్ అవుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన ప్రధాన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. బాలినేనికి మరింత బాధ కలిగిస్తోంది. ఇక అటు గడప గడపకు సమీక్షలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని 175స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు పనిచేయాలని, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే టికెట్ కేటాయింపు ఉంటుందని సూచించారు. అంతేకాదు ఈసారి కొంతమందికి టికెట్ ఇవ్వడం లేదని.. వాళ్లు అసంతృప్తికి గురికావొద్దని.. వారికీ ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పారు. ఈ స్టేట్‌మెంట్ ఎనాలసిస్ చేస్తే.. చాలామందికి ఈసారి టికెట్ రావడం కష్టమే అనిపిస్తుంది. మరి టికెట్ రాని నేతలు.. వైసీపీలో కొనసాగుతారా.. లేదా మరో పార్టీలో చేరుతారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.