YSRCP: వైసీపీలో టిక్కెట్ల హడవిడి కొనసాగుతోంది. సీఎం జగన్.. ఎవరికి టిక్కెట్లు కేటాయించాలనే విషయంలో క్లారిటీతో ఉన్నారు. అయితే, కొందరి నుంచి టిక్కెట్ల కోసం వినతులు వస్తున్నాయి. వారిలో సినీ నటుడు అలీ కూడా ఉన్నాడు. అలీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. రాజ్యసభకు పంపిస్తారని, లేదా ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఇస్తారని.. ఇలా రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అయితే అలాంటి పెద్ద పదవులేవీ ఆయకు దక్కలేదు.
Global Star, Mega Daughter : మహాలక్ష్మి ఆలయంలో మెగా డాటర్ పూజలు..
కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిలో నియమించింది అధిష్టానం. అదే సమయంలో 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అలీకి, గుంటూరుకు అనుబంధం ఉండటం, గుంటూరు ఈస్ట్ సీట్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఆయనకు గుంటూరు ఈస్ట్ సీటు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. తర్వాత రాజమండ్రి రూరల్, అర్బన్ స్థానాల్లో ఒకచోట సీటు కేటాయించే అవకాశం ఉందన్నారు. కానీ, ఇవేవీ నిజం కాలేదు. అయితే, ఇప్పుడు ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం కూడా పరిశీలిస్తోంది. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అయితే, ఈసారి ఆయనకు అక్కడ మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు.
అందుకే అలీ లేదా మరొకరికి టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇంతకు ముందు ఈ నియోజకవర్గం నుంచి ఎంకే బేగ్ గెలిచి మంత్రయ్యారు. ఆ తర్వాత జలీల్ ఖాన్, సీపీఐ నుంచి నాసర్‌వలీ వంటి ముస్లిం నేతలు ఎమ్మెల్యేగా గెలిచారు. ముస్లిం జనాభా ఎక్కువుగా ఉండటంతో వైసీపీ సహా ప్రధాన పార్టీలు ముస్లిం అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ పరిస్థితిని అలీ వినియోగించుకుంటున్నారు. మరి అలీకి వైసీపీ టిక్కెట్ ఇస్తుందా.. లేదా.. మరికొద్ది రోజుల్లో తేలనుంది.