Killi Krupa Rani: శ్రీకాకుళంలో తు‘ఫ్యాన్’.. టీడీపీలోకి ‘కిల్లి’..!

వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం ఎంపీ సీటును డాక్టర్ దానేటి శ్రీధర్‌కు ఇప్పించేందుకు ధర్మాన సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు కిల్లి కృపారాణి మరో పార్టీ వైపు చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు టీడీపీలో కొంతమేర అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 07:48 PM IST

Killi Krupa Rani: శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీకి షాక్ తగలబోతోంది. ఓ కీలక నేత ఫ్యాన్ గాలిని వదిలేసి.. సైకిల్ సవారీని మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మహిళా నాయకురాలు కిల్లి కృపారాణి చూపు ఇప్పుడు టీడీపీ వైపు ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆమె 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ సమయంలో ఆమె వైఎస్సార్‌సీపీ తరఫున శ్రీకాకుళం ఎంపీ సీటుకు ట్రై చేసి భంగపడ్డారు. ఆ సీటును అప్పట్లో దువ్వాడ శ్రీనివాస్‌కు కేటాయించినా.. వైఎస్సార్‌సీపీలోనే కొనసాగారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి లేదా రాజ్యసభ సీటు దక్కుతుందని ఆశించినా అలా జరగలేదు.

వచ్చే ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం నుంచి ఆమెకు హామీ దక్కలేదు. కనీసం టెక్కలి లేదా నరసన్నపేట అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వలేమని వైఎస్సార్‌సీపీ అధిష్టానం కిల్లి కృపారాణికి చెప్పినట్టు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం ఎంపీ సీటును డాక్టర్ దానేటి శ్రీధర్‌కు ఇప్పించేందుకు ధర్మాన సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు కిల్లి కృపారాణి మరో పార్టీ వైపు చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు టీడీపీలో కొంతమేర అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో తనకు శ్రీకాకుళం ఎంపీ స్థానం ఇవ్వాలంటూ టీడీపీ కీలక నేతలతో కిల్లి కృపారాణి చర్చలు జరిపారని అంటున్నారు.
కిల్లి కృపారాణి ఒకవేళ టీడీపీలోకి వస్తే.. శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఆ పార్టీ అధిష్టానం రెడీగా ఉంది. ఆమె పార్టీలో చేరడమే తరువాయి అన్నట్టుగా టీడీపీ ఎదరు చూస్తోంది. ఇదిలా ఉంటే కిల్లి కృపారాణి ఆలోచనలు వేరేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం వైసీపీ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న కృపారాణి రాకతో టీడీపీ బలోపేతం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. కృపారాణి కాళింగ సామాజికవర్గానికి చెందినవారు. ఆమె వల్ల ఆ వర్గం ఓట్లు కూడా టీడీపీకి పడతాయనే అంచనాలో బాబు ఉన్నారట. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మాజీ కేంద్రమంత్రి, వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణికి చేదు అనుభవం ఎదురైంది. హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. సీఎంకు ఆహ్వానం పలికే నాయకుల జాబితాలో ఆమె పేరు లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు.

దీంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు వర్గీయులు ఆమెకు నచ్చజెప్పారు. అధికారులు పని ఒత్తిడి వల్ల మీ పేరు మరిచిపోయి ఉండొచ్చు.. వారితో మేం మాట్లాడి జగన్ వద్దకు తీసుకెళ్తామని నేతలు చెప్పినా కృపారాణి వినిపించుకోలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్రమంత్రిగా పనిచేసిన తాను ఎవరో జిల్లా కలెక్టర్, అధికారులకు తెలియదా.. తనకు జరిగిన అవమానం ఇక చాలు అంటూ కిల్లి కృపారాణి కారు ఎక్కి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇక ఆమె వైఎస్సార్‌సీపీలో కొనసాగే ఛాన్స్ లేదనే అంచనాలు వెలువడుతున్నాయి.