వాళ్లు వీళ్లయ్యారు… వీళ్లు వాళ్లయ్యారు… ఈయన అటొస్తే ఆయన ఇటొస్తున్నారు. ఇదీ గన్నవరం రాజకీయం… లేటెస్ట్‌గా చెప్పాలంటే గన్నవరంలో వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు హ్యాండ్ ఇవ్వబోతున్నారు. రేపో మాపో ఆయన సైకిలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. వంశీ పేరెత్తితేనే మండిపడుతున్న ఆయన టీడీపీ తరపున బరిలోకి దిగి అదే వంశీని ఢీకొట్టబోతున్నారు.
గన్నవరం రాజకీయం ఎప్పుడూ ఏపీలో హాట్‌టాపికే…. అక్కడ ఏం జరిగినా రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తుంది. అయితే ఈసారి గన్నవరంలో జరుగుతున్న ప్రచారం ఆ ఉత్కంఠను మరింత పెంచుతోంది. పోయిన సారి వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. అలాగే టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన వంశీ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు.
మొత్తంగా చూస్తే గన్నవరంలో పార్టీలు సేమ్…. అభ్యర్థులే అటువాళ్లు ఇటు, ఇటువాళ్లు అటు అవుతున్నారన్నమాట.
యార్లగడ్డ పేరుతో ఇటీవల వచ్చిన ఓ పోస్ట్ పెద్ద సంచలనాన్నే రేపింది. గన్నవరం నియోజకవర్గానికి మంచిరోజులు వస్తున్నాయి. 2024లో గన్నవరాన్ని మొదటి స్థానంలో నిలబెడతానని హామీ ఇస్తున్నా అన్నది ఆ పోస్టు సారాంశం. దీని అర్థమేంటన్నదానిపై రకరకాల ప్రచారాలు సాగాయి. తీగలాగితే అది సైకిల్‌కు తగులుకుంది. పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఆయన టీడీపీలో చేరబోతున్నట్లు పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది. వంశీని ఓడించి తీరుతానన్నది యార్లగడ్డ శపథంగా ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆయన వర్గంలోని మరికొందరు మాత్రం అసలు ఆ పోస్టు యార్లగడ్డ పెట్టలేదంటున్నారు. మరి అలాంటప్పుడు ఆయన దాన్ని ఎందుకు ఖండించలేదన్న దానికి మాత్ర వారి దగ్గర సమాధానం లేదు. దీన్ని బట్టి చూస్తే యార్లగడ్డ ఉద్దేశమేంటో అర్థమైపోతుంది.
2019లో టీడీపీ తరపున వంశీ , యార్లగడ్డ వైసీపీ తరపున బరిలోకి దిగారు. రాష్ట్రమంతా వైసీపీ హవా నడిచినా గన్నవరంలో మాత్రం సైకిల్ గట్టెక్కింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వంశీ సైకిల్‌ను పడేసి ఫ్యానుగాలికి సేదతీరారు. అప్పట్నుంచే గన్నవరం రగులుతోంది. వంశీ, యార్లగడ్డ మధ్య కోల్డ్‌వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. తనను ఓడించి తిరిగి తన పార్టీలోకే వచ్చి తన ముందే తిరుగుతున్న వంశీని చూసి యార్లగడ్డ రగిలిపోయారు. వంశీ కూడా యార్లగడ్డ వర్గాన్ని కలుపుకుపోయే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆ దూరం అలాగే ఉండిపోయింది. పలుమార్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ప్రతిసారి వంశీ వర్గానిదే పైచేయి అయ్యింది. దీంతో యార్లగడ్డ నిస్సహాయంగా మిగిలిపోయారు. పార్టీ హైకమాండ్ పలుమార్లు సమస్యను సర్దుబాటు చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. చేతులు కలవలేదు. మాటలు కలవలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున వంశీ పోటీ చేయడం ఖాయమని తేలిపోవడంతో యార్లగడ్డ ఆ పార్టీని వీడాలని డిసైడయ్యారు.
టీడీపీకి కూడా గన్నవరంలో నాయకత్వ లోపం కనిపిస్తోంది. వంశీ పార్టీని వీడిన తర్వాత నియోజకవర్గ బాధ్యతల్ని బచ్చల అర్జునుడికి అప్పగించారు చంద్రబాబు. అయితే అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశారు. ఆ తర్వాత మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అయితే ఆయన అంతగా ఫోకస్ పెట్టలేకపోయారు. పట్టాభితో పాటు మరో ముగ్గురు నలుగురు ఇక్కడ్నుంచి సీటు ఆశిస్తున్నారు. వంశీని ఢీకొట్టగలిగే స్థాయి వారికి ఉందా అన్నది డౌటే. ఈ సమయంలోనే యార్లగడ్డ టీడీపీలో చేరడానికి ఆసక్తిని ప్రదర్శించారు. చంద్రబాబు కూడా అందుకు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. యార్లగడ్డ ఆర్థికంగా బలమైన నేత కూడా. గత ఎన్నికల్లో వంశీని ఓడించడానికి భారీగా ఖర్చు చేశారు. ఈసారి వంశీని ఓడిస్తానని శపథం చేసిన ఆయన… ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే మరికొన్ని రోజుల్లో యార్లగడ్డ పసుపు కండువాతో కనిపించడం ఖాయమనిపిస్తోంది. చూడాలి మరి ఈసారి గన్నవరంలో గెలుపెవరిదో….!