YS JAGAN: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి పార్టీకి వారసుల అంశం సమస్యగా మారుతోంది. వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న నేతలు తమ కొడుకు, కూతురుకు టిక్కెట్లు ఇప్పించుకోవాలని, అవసరమైతే తాము రిటైర్ అవ్వాలని భావిస్తుంటారు. వారసులకు టిక్కెట్ల కోసం అధిష్టానంపై ఒత్తిడి తెస్తారు. దీంతో ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్న నేతలకు టిక్కెట్లు ఇవ్వాలా.. లేక వారి వారసులకు టిక్కెట్లు ఇవ్వాలా అనే విషయం పార్టీలకు ఇబ్బందిగా మారుతుంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా ఇదే. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాల్సిందిగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. తమ పిల్లలకు టిక్కెట్లు ఇస్తే గెలిపించుకుంటామని, వారి రాజకీయ భవిష‌్యత్తుకు సహకరించాలని కోరుతున్నారు. తాము రాజకీయాల నుంచి తప్పుకొంటామని చెబుతున్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అంటే రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పారు. తనకు బదులు.. తన కుమారుడు కృష్ణమూర్తికి టిక్కెట్ ఇవ్వాలని మచిలీపట్నంలో జరిగిన ఒక సభ సాక్షిగా సీఎం జగన్‌ను కోరారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తన కుమారుడు మోహిత్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడికి టిక్కెట్ ఇస్తే తాను రాబోయే ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా తన కొడుకు భూమన అభినయ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని ఇప్పటికే జగన్‌ను కోరారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పారు. దీనికి అనుగుణంగానే ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు.
దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగూ భూమన పోటీ చేయరు. ఆయన తనయుడే పోటీ చేసే అవకాశం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు.. ఆయన తనయుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడికి టిక్కెట్ ఇప్పించుకోవాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారం కూడా తన కొడుకు చిరంజీవి వెంకటనాగ్‌కు ఆముదాలవలస టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన శిల్పా మోహన్ రెడ్డి, గోదావరి జిల్లాలకు చెందిన తోట త్రిమూర్తులు, మంత్రి పినిపె విశ్వరూప్, ప్రకాశం జిల్లా నుంచి బాలినేని, వైవీ సుబ్బారెడ్డి వంటి కొందరు తమ వారసులకు టిక్కెట్ల కోసం అధిష్టానాన్ని సంప్రదించారు. టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ తన సతీమణి వాణికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కూడా తన కుమార్తె నూరి ఫాతిమాకు టిక్కెట్ ఇవ్వాల్సిందిగా వైసీపీ పెద్దలను కోరారు.
జగన్ టిక్కెట్లు ఇస్తారా..?
వారసులకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో వైఎస్ జగన్ సందేహిస్తున్నారని తెలుస్తోంది. వారసులకు టిక్కెట్లు కావాలని కొందరు నేతలు గతంలోనే అడిగారు. కానీ, పెద్దగా జనాలకు పరిచయంలేని వారసులకు టిక్కెట్లు ఇస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్న సందేహంతో అప్పట్లో జగన్ దీనికి నిరాకరించారు. ఇప్పటికైతే మీరు పోటీ చేయండి.. వచ్చే ఎన్నికల్లో వారసులకు అవకాశం కల్పిస్తాం అని అప్పట్లో జగన్ వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జగన్‌ను నమ్మి పోటీ చేసిన నేతలు ఇప్పుడు వారసులకు టిక్కెట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. అయితే, ఇప్పుడు కూడా వారసులకు టిక్కెట్లు ఇచ్చే అంశంపై సందేహంగానే ఉన్నారు. వారసులకు టిక్కెట్ల కోసం ఒత్తిడి తేవొద్దని గతంలోనే కొందరు నేతలకు చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతలు ఈ విషయంలో జగన్‌పై ఒత్తిడి తేస్తున్నారు. వీరిలో కొందరు వారసులకు టిక్కెట్లు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగానే ఉన్నారు. కొందరి మాటను జగన్ కాదనలేని పరిస్థితి. అలాగని వారికి టిక్కెట్లు ఇచ్చి, మిగతావారికి నిరాకరిస్తే అది మరో తలనొప్పిగా మారుతుంది. అందుకే ప్రస్తుతానికి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. తమ వారికి టిక్కెట్లు రాకపోతే కొందరు నేతలు తిరుగుబాటు చేస్తే వైసీపీకి నష్టం తప్పదు. ఈ విషయంలో జగన్ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.