YS Jagan: గెలవడం ముఖ్యమే.. కానీ గెలుపును నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార పీఠంపై ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పాయింట్ పైనే ఫోకస్ పెట్టింది. ఈ దిశగానే వచ్చే అసెంబ్లీ పోల్స్ కోసం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తోందని సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్ల రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలకుగానూ 151 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. టీడీపీ అభ్యర్థులు కేవలం 23 చోట్ల నెగ్గారు. వచ్చే పోల్స్‌లో కూడా అదే స్థాయిలో భారీ విజయాన్ని మూట కట్టుకోవాలని సీఎం జగన్ సేన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తమ అభ్యర్థుల తొలి జాబితాను ఈ దసరా (అక్టోబరు 24) పండుగ తరువాత వైఎస్సార్‌సీపీ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. 72 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను జగన్ రెడీ చేశారని అంటున్నారు. ఇందులో 50 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలు కాగా, మిగిలిన 22 మంది కొత్త క్యాండిడేట్స్ అని తెలుస్తోంది. వీలైనంత తొందరగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల అభ్యర్థులకు ప్రచారం చేసుకోవటానికి కావాల్సినంత సమయం దొరకడంతో పాటు అసంతృప్తులను దారికి తెచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుందని అనుకుంటున్నారు.
గడపగడపకు వైసీపీ.. ఫీడ్ బ్యాక్ ప్రామాణికం..
“గడపగడపకు వైసీపీ” కార్యక్రమాన్ని వైఎస్ జగన్ దాదాపు ఏడాదిపాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించారు. తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై, వారిపై ప్రజలకు ఏర్పడిన అభిప్రాయం గురించి అంచనాకు వచ్చేందుకు ఈ ప్రోగ్రాంనే సీఎం జగన్ ప్రామాణికంగా తీసుకున్నారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. “గడపగడపకు వైసీపీ”పై ఇటీవల నిర్వహించిన పార్టీ వర్క్ షాపు సందర్భంగా దాదాపు 18 మంది ఎమ్మెల్యేలపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. వారిలో చాలామందికి వచ్చే పోల్స్‌లో టికెట్లు దక్కేది అనుమానమే అని తెలుస్తోంది.
ఆ ఎమ్మెల్యేలకు షాక్..
దసరా తర్వాత రిలీజ్ కాబోయే వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మొదటి జాబితా.. జగన్ మెప్పు పొందలేకపోయిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. ఆ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన వైపు చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెంబర్-2 స్థానంలో ఉన్న వైఎస్సార్‌సీపీ లీడర్స్‌తో పాటు పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న వారికి ఇప్పటికే నామినేటెడ్ పోస్ట్‌లు కేటాయించారు. రాబోయే రోజుల్లో కూడా అసంతృప్తి నేతలను కూల్ చేసేందుకు నామినేటెడ్ పదవుల కేటాయింపును జగన్ స్పీడప్ చేస్తారని సమాచారం.