ఏ అసంతృప్తుల గురించి సీఎం జగన్ ముందు నుంచి భయపడ్డారో వాళ్లే చివరికి పార్టీకి టోపీ పెట్టారు. దీంతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన వైసీపీ.. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అలా సస్పెండ్ చేశారో లేదో.. ఇలా అధిష్టానంపై డైరెక్ట్ ఎటాక్ మొదలు పెట్టారు ఎమ్మెల్యేలు.
తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని చెప్తూనే వైసీపీ హైకమాండ్‌పై నిప్పులు చెరిగారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. సస్పెండ్ చేసినందుకు వైసీపీ హైకమాండ్‌కు థాంక్స్ చెప్పారు. ఇప్పుడు తాను చాలా రిలాక్సింగ్‌గా ఫీలవుతున్నానన్నారు. తన ముందు రాజకీయంగా ఎదిగినవాళ్లను తనపై పోటీకి పంపి అధిష్టానం అవమానించిందని తన ఫ్రస్ట్రేషన్‌ను బయటపెట్టారు. ఇక వైసీపీకి మూడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా వైసీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనను పార్టీ నుంచి దూరం చేస్తున్నారంటూ చెప్పారు. హైకమాండ్ చెప్పినట్టే ఓటింగ్ చేసినా.. కావాలని సస్పెండ్ చేశారంటూ చెప్పారు. తాను నిన్న కూడా కూతురితో వెళ్లి జగన్‌ను కలిశానని.. పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. తాను ఎందుకు క్రాస్ ఓటింగ్ చేస్తానంటూ ప్రశ్నించారు. కానీ వైసీపీ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నట్టు స్టేట్‌మెంట్ ఇస్తోంది. అన్ని ఆధారాలు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకున్న తరువాతే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు.
ఈ సస్పెన్షన్ల పర్వం ఈ నలుగురితో ఆగుతుందా.. అసంతృప్తుల లిస్ట్ ఇంకా పెరుగుతుందా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.