YSRCP: మరి మీరెటు విజయసాయిరెడ్డి గారు…!?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ మంచి ప్రశ్న లేవనెత్తారు... పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీడీపీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బాగానే ఉంది... అలా అడగాలి కూడా... మరి ఇంతకీ వైసీపీ ఎటువైపుంది విజయసాయిరెడ్డి గారు...! బీజేపీ వైపా లేక ఇండియా కూటమివైపా....?

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 11:59 AM IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ మంచి ప్రశ్న లేవనెత్తారు… పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీడీపీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బాగానే ఉంది… అలా అడగాలి కూడా… మరి ఇంతకీ వైసీపీ ఎటువైపుంది విజయసాయిరెడ్డి గారు…! బీజేపీ వైపా లేక ఇండియా కూటమివైపా….?

పార్లమెంట్‌లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అటు బీఆర్ఎస్ కూడా మరో తీర్మానాన్ని ఇచ్చింది. త్వరలో ఈ అవిశ్వాసంపై చర్చ జరగనుంది. ఈ అవిశ్వాసానికి సంబంధించి టీడీపీ, వైసీపీ వైఖరిపైనే ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తోంది. టీడీపీకి లోక్‌సభలో ఉన్నది ముగ్గురు ఎంపీలు. వారి ఓటు కీలకమేం కాదు… కానీ వైసీపీ సంగతి అలా కాదు… 22మంది ఎంపీలు దిగువసభలో ఉన్నారు. మరి వైసీపీ వైఖరేంటి…?

అవిశ్వాసానికి మద్దతుగా టీడీపీ ఎంపీలు ఎందుకు లేచి నిలబడలేదో చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఈనాడును టార్గెట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ప్రశ్నేమిటంటే మరి వైసీపీ వైఖరేంటి…? అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నట్లా లేక మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నట్లా…? మణిపూర్ ప్రజలవైపే ఉన్నట్లైతే మరి వారెందుకు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలబడలేదు…? పోనీ వారు మోడీ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నట్లైతే దాన్ని అధికారికంగా చెప్పొచ్చు కదా.. తమ వైఖరేంటో చెప్పకుండా మీ వైఖరి చెప్పాలని విపక్షాన్ని ప్రశ్నించడమెందుకు…? పోనీ లేచినిలబడకుండా మేం బీజేపీ వైపే ఉన్నామని వైసీపీ చెప్పిందనుకోవాలా…? అదే నిజమైతే మీరు, టీడీపీ ఒకే వైపు ఉన్నట్లు కదా.. మరి మళ్లీ దాన్ని ప్రశ్నించడమెందుకు…? నిజానికి టీడీపీ కానీ, వైసీపీ కానీ బీజేపీవైపు ఉండక తప్పని పరిస్థితి. ఇది అందరికీ తెలిసిన రహస్యమే.

పార్లమెంట్‌లో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఓ రకంగా వైసీపీకి మంచి అవకాశం. వైసీపీ మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా మోడీ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందులేమీ లేవు. కానీ లోక్‌సభలో ఎక్కువమంది ఎంపీలున్న ఓ పార్టీగా వైసీపీ వాదనకూ విలువ ఉంటుంది. ఈ సమయంలో మణిపూర్ సంగతి నాకెందుకు నాకు నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమర్ధించొచ్చు. ఈ తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ కొన్ని పనులు చేయించుకోవచ్చు. ప్రత్యేకహోదా, పోలవరం, రాజధాని అంశం, పెండింగ్ నిధులు, విభజన హామీలు ఇలా ఎన్నో విషయాలు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. మేం మీకు మద్దతిస్తున్నాం కాబట్టి మా పనులు ఎవో కొన్నైనా చేయండి అని కేంద్రాన్ని అభ్యర్థించవచ్చు…

నిజానికి వైసీపీ కేంద్రాన్ని డిమాండ్ చేసే పరిస్థితిలో లేదన్నది మనందరికీ తెలిసిందే. సీఎం జగన్మోహన్ రెడ్డి పిలక బీజేపీ చేతిలో ఉంది. ఏ మాత్రం తోక జాడించినా ఆస్తుల కేసు నుంచి బాబాయ్ గొడ్డలి కేసు వరకు ఏదైనా బయటకు రావొచ్చు. కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. చచ్చినట్లు బీజేపీకి మద్దతివ్వక తప్పని పరిస్థితి వైసీపీది. అటు టీడీపీది కూడా అదే పరిస్థితి. ఎందుకంటే తన రాజకీయ అవసరాల కోసం బీజేపీ ప్రాపకానికై చంద్రబాబు పాకులాడుతున్నారు. కాబట్టి ఆయన కూడా ఆ పార్టీవైపే ఉండక తప్పని పరిస్థితి. అంటే పార్టీలకు అతీతంగా ఏపీలోని 25 మంది లోక్‌సభ ఎంపీలు చచ్చినట్లు మోడీని సమర్ధించాల్సిందే. అయితే అధికారపక్షంగా వైసీపీకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. తమ రాజకీయ అవసరాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడేందుకు ప్రయత్నించొచ్చు. డిమాండ్ చేయలేకపోయినా మేము మీవైపే ఉన్నాం కాబట్టి కాస్త కరుణించండి అని వేడుకోవచ్చు. కానీ వైసీపీ అవేమీ చేస్తున్న దాఖలాలు లేవు. మీరు మా రాష్ట్రానికి ఏం చేయకపోయినా పర్లేదు కానీ మా జోలికి మాత్రం రాకండి అన్నట్లుంది ఆ పార్టీ వైఖరి.