నెల్లూరు వైసీపీలో మరో రెడ్డి వికెట్ కూలడం ఖాయం అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత.. నెల్లూరుకు చెందిన ముగ్గురు వైసీపీ నేతలపై సస్పెన్షన్ వేటు పడింది. పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందుగానే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో వైసీపీకి కంచుకోటలా ఉన్న నెల్లూరు జిల్లాలో లుకలుకలు మొదలయ్యాయ్. ఐతే ఇప్పుడు పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా త్వరలోనే పార్టీకి రాంరాం చెప్పబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయ్. మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ప్రసన్నకుమార్ రెడ్డి రగిలిపోతున్నారని.. రెండో మంత్రివర్గ విస్తరణలో అయినా తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించ భంగపడ్డారని టాక్ వస్తోంది.
మంత్రి పదవి దక్కకపోయినా కనీసం తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రావట్లేదని అనుచరుల దగ్గర ప్రసన్నకుమార్ రెడ్డి వాపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. పార్టీ ఆరంభం నుంచి ప్రసన్నకుమార్ రెడ్డి.. జగన్‌కు అండగా ఉన్నారు. 2012 నుంచి ఆయనతోనే కలిసి నడుస్తున్నారు. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంత్రి పదవి ఖాయం అనుకున్న నాయకుల జాబితాలో ప్రసన్నకుమార్ రెడ్డి పేరు టాప్‌లో వినిపించింది. ఐతే కారణం ఏదైనా అది జరగలేదు. మంత్రివర్గ విస్తరణలోనూ ఆయనను జగన్ దూరం పెట్టిన పరిస్థితి. దీంతో పార్టీ మీద, అధినేత మీద అసంతృప్తితో రగిలిపోతున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పడమే బెటర్ అనుకుంటున్నారని తెలుస్తోంది. టీడీపీ లేదా బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. టీడీపీ పదేపదే చెప్తున్న 16మంది లిస్టులో ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ఉన్నారని టాక్ వస్తోంది.