వైసీపీ సోషల్ మీడియా” ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేని అత్యంత బలమైన సోషల్ మీడియా వింగ్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా సరే అక్షరాలా నిజం. వాళ్ళ మాటలు, వాళ్ళు చేసే పోస్ట్ లు, వాళ్ళ స్టైల్ మేకింగ్ వీడియోలు అత్యంత వివాదాస్పదం అయినా… అబద్దాన్ని ఇది పచ్చి నిజం అని నమ్మించే సామర్ధ్యం ఉన్న సోషల్ మీడియా వింగ్ అది. ఎవరిని అయినా ఏ మాత్రం వెనకడుగు లేకుండా, ఆడ అయినా మగ అయినా సరే ఏ మాత్రం మొహమాటం లేకుండా అభ్యంతరకరంగా తిట్టడంలో వాళ్ళు దిట్ట.
ఒకప్పుడు వైఎస్ జగన్ కు, వైసీపీ సోషల్ మీడియాకు అదే బలం… అదే ధైర్యం. కానీ సీన్ గత అయిదేళ్ళ నుంచి రివర్స్ అయింది. అబద్దాలను ప్రచారం చేస్తే ఇబ్బంది లేదు గాని… అభ్యంతరకంగా మార్ఫింగ్ ఫోటోలు, కుటుంబాలను, ఆడవాళ్ళను వెనుకా ముందు చూడకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది దారుణం. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి సోషల్ మీడియానే కారణం. జగన్ విధానాలను సమర్ధించే క్రమంలో వాళ్ళు ఉపయోగించిన విధానాలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. చివరకు జగన్ ను వ్యతిరేకిస్తున్నారనే కారణంతో షర్మిలను కూడా దారుణంగా మాట్లాడింది వైసీపీ సోషల్ మీడియా.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. సోషల్ మీడియా బెండ్ తీయడం స్టార్ట్ అయింది. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అరెస్ట్ లు చేస్తున్నారని జగన్ నుంచి వైసీపీ నేతలు అందరూ పదే పదే వాదించే ప్రయత్నం చేస్తున్నా… ప్రజల్లో మాత్రం మద్దతు లేదు. బోరుగడ్డ అనీల్, శ్రీ రెడ్డి వైసీపీకి సంబంధం లేదని చెప్తున్నా… వాళ్ళు వైసీపీకి మద్దతు ఇస్తూ ఇష్టానుసారం మాట్లాడినా అడ్డుకునే ప్రయత్నం వైసీపీ నేతలు చేయలేదు. ఇక వర్రా రవీంద్రా రెడ్డి, ఇంటూరి రవి కిరణ్ సహా కొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎంత అభ్యంతరకరంగా మాట్లాడారో ప్రజలకు ఒక అవగాహన ఉంది.
ఇంటూరి రవి కిరణ్ కు ఏకంగా మీడియా కార్డు ఇచ్చారు ప్రభుత్వంలో. ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకే పదుల సంఖ్యలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిని అరెస్ట్ చేయడమే జగన్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసిందనే కామెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకప్పుడు జగన్ మాట్లాడే మాటలను వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్ళేది. రీల్స్, మీమ్స్ ఇలా ఏ విధంగా అవకాశం ఉంటే అలా వైరల్ చేసేవారు.
కాని జగన్ ప్రెస్ మీట్ లకు గాని వైసీపీ నేతలు ఎంత గొంతు చించుకుని ప్రసంగాలు చేస్తున్నా సరే… అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం లేదు. బుధవారం జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నో అంశాలపై ఆయన ప్రసంగించారు. కాని సోషల్ మీడియాలో ఎక్కడా కూడా వాటి గురించి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడటం లేదు. భయమో లేక మరేదైనా కారణమో తెలియదు గాని జగన్ వీడియోలు కూడా పోస్ట్ చేయడానికి భయపడుతున్నారు.
2019 లో జగన్ ప్రసంగాలను యమాగా వైరల్ చేసిన ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కనీసం జగన్ కు మద్దతుగా పోస్ట్ చేయాలన్న్నా సరే భయపడిపోతున్నారు. వైసీపీ నేతలు ఎంత మద్దతు ఇస్తున్నా… అరెస్ట్ అయిన తర్వాతి పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తలకు కంటి మీద కునుకు ఉంచడం లేదు. థర్డ్ డిగ్రీ జరుగుతుంది అనే భయం కూడా వారిలో ఉంది. వర్రా రవీంద్రా రెడ్డిని, పెద్దిరెడ్డి సుధారాణిని అరెస్ట్ చేసినా పోలీసులు అరెస్ట్ నాలుగు రోజుల పాటు చూపలేదు అని ఆ నాలుగు వారికి ట్రీట్మెంట్ జరిగి ఉంటుందని… వారిని భయం వెంటాడుతుంది.
అందుకే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా రిస్క్ చేయడం లేదు. చివరకు జగన్ ను కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు అని… రాజకీయాలను పక్కబెట్టి… పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ పై వారు ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియాను లీడ్ చేసే వ్యక్తులు కూడా కరువు అయ్యారు. ముందస్తు బెయిల్ కోసం సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. దీనితో వైసీపీ సోషల్ మీడియాకు కామన్ గా వెళ్ళే కంటెంట్ కూడా వెళ్ళడం లేదు. ఇదే కంటిన్యూ అయితే జగన్ కు ఇబ్బందులు తప్పవు.