Ysrcp Vs BJP: వైసీపీ వర్సెస్ బీజేపీ.. అప్పుల చుట్టూ ఏపీ రాజకీయం.. వైసీపీ చేసిన అప్పు రూ.7 లక్షల కోట్లా..?

టీడీపీ ఐదేళ్లలో చేసిన అప్పులకంటే వైసీపీ నాలుగేళ్లలో చేసిన అప్పులే ఎక్కువని పురందేశ్వరి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై దర్యాప్తు జరిపిస్తామని, ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్తామని పురందేశ్వరి అన్నారు.

  • Written By:
  • Publish Date - July 20, 2023 / 03:15 PM IST

Ysrcp Vs BJP: ఏపీలో రాజకీయం ఇప్పుడు వైసీపీ వర్సెస్ బీజేపీగా సాగుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలోనే రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని పురందేశ్వరి ఆరోపించారు. దీనిపై వైసీపీ విమర్శలు చేస్తోంది.
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన పురందేశ్వరి అధికార వైసీపీపై ఘాటుగా విమర్శలు చేస్తోంది. అందులో ఏపీ అప్పుల గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీ అప్పుల కుప్పగా మారిపోయిందన్నారు. పురందేశ్వరి చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీ విభజన నాటికి నూతన ఏపీ అప్పు రూ.97,000 కోట్లు. అధికారం చేపట్టిన తర్వాత ఐదేళ్ళలో చంద్రబాబు చేసిన అప్పు రూ 2,65, 365 కోట్లు. మొత్తంగా 2019 మార్చ్ 31 నాటికి ఏపీ మీద ఉన్న అప్పు రూ.3,62,375 కోట్లు. అనంతరం వైసీపీ అధికారం చేపట్టింది. ఇప్పుడు ఏపీ అప్పులు రూ.10,77,006 కోట్లకు చేరాయి. అంటే నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.7,14,631 కోట్లు . టీడీపీ ఐదేళ్లలో చేసిన అప్పులకంటే వైసీపీ నాలుగేళ్లలో చేసిన అప్పులే ఎక్కువని పురందేశ్వరి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై దర్యాప్తు జరిపిస్తామని, ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్తామని పురందేశ్వరి అన్నారు.
వైసీపీ సమాధానం ఇదే
పురందేశ్వరి చేసిన విమర్శలపై వైసీపీ ప్రభుత్వం స్పందించింది. కాగ్ లెక్కల ప్రకారం వైసీపీ ప్రభుత్వం తక్కువ అప్పులే చేస్తోందని వైసీపీ మంత్రి గుడివాడ అమర్‌‌నాథ్ అన్నారు. తమ ప్రభుత్వం ఒక పక్క సంక్షేమాన్ని, మరో పక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు రూపొందిస్తోందని, ఇందుకోసం నిబంధనలకు అనుగుణంగా నిధులు సేకరిస్తున్నామన్నారు. తాము తెచ్చిన అప్పుల్ని దుబారా చేయడం లేదని అమర్నాథ్ అన్నారు. ఎవరికీ చెప్పకుండా అప్పులు తేవడం లేదన్నారు. ‘‘ఏదో మాట్లాడాలి కాబట్టి పురందేశ్వరి ఆరోపణలు చేసినట్లుంది. గతంలో చంద్రబాబు హయాంలో చేసిన అప్పులకు లెక్కా జమ లేదు. అప్పుడు బీజేపీ కూడా ఆయనతో కలిసి ఉంది. అప్పుడు బిజెపిలోనే ఉన్న పురందేశ్వరి, చంద్రబాబు చేసిన అప్పుల గురించి ఎందుకు అడగలేదు. జగన్ ప్రభుత్వం అప్పు చేసిన ప్రతి పైసాకు లెక్క చెబుతోందిచిన్నమ్మ నిజాలు తెలుసుకుంటే మంచిది”అని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి: బీజేపీ
దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై సరైన సమాధానం ఇవ్వకుండా ప్రతి విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ చేసిన ఆరోపణలపై ప్రతివిమర్శలు చేయడం సరికాదని, సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఐదేళ్ల చంద్రబాబు పాలనలో‌ రూ.2,65,365 కోట్లు అప్పు చేశారు. అదే వైసీపీ నాలుగేళ్ల పాలనలో రూ.7,14,631 కోట్లు అప్పు తెచ్చారు. ఇది వాస్తవం కాదా..? పురందేశ్వరి చాలా వివరంగా ఏపీ ప్రభుత్వ అక్రమ అప్పుల గురించి వివరాలు బయట పెట్టారు. అ వివరాలు తప్పయితే ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలు బయటపెట్టాలి. బీజేపీ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేదంటే మేం చెప్పింది నిజమేనని ఒప్పుకున్నట్లేనా..? అప్పుల గురించి ఏపీ అర్థిక మంత్రి స్పందించాలి. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి” అని విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.