YSRCP Vs TDP: పొలిటికల్ వార్.. ఏపీ హేట్స్ జగన్ అంటున్న టీడీపీ.. వై ఏపీ నీడ్స్ జగన్ అంటున్న వైసీపీ..

వైసీపీ, టీడీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతుంటే.. ఏపీ హేట్స్ జగన్ పేరుతో టీడీపీ పుస్తకాన్ని రిలీజ్ చేసింది. దీంతో వైసీపీ, టీడీపీ.. పోటాపోటీగా ప్రచారానికి దిగాయి.

  • Written By:
  • Publish Date - October 20, 2023 / 03:19 PM IST

YSRCP Vs TDP: ఏపీలోనూ రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణకు ధీటుగా ఏపీలోనూ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రతి పార్టీ తమ ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. వైసీపీ, టీడీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతుంటే.. ఏపీ హేట్స్ జగన్ పేరుతో టీడీపీ పుస్తకాన్ని రిలీజ్ చేసింది. దీంతో వైసీపీ, టీడీపీ.. పోటాపోటీగా ప్రచారానికి దిగాయి.

రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధించాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే పార్టీని మరింతగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో ఏపీకి జగన్ ఏం చేశారు.. తమకు మళ్లీ అధికారం ఎందుకు కావాలో వివరించాలని నేతలకు సూచించారు. ఇందుకోసం వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఇన్నాళ్లు చేసిన సంక్షేమాన్ని గుర్తుచేస్తూ జగన్ తోనే ఇవన్నీ సాధ్యమనే భావనను వారిలో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రచారం చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వైసీపీ అన్ని సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సాగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేలా టీడీపీ మరో అస్త్రంతో సిద్ధమైంది.

ఏపీ హేట్స్ జగన్ పేరుతో ఒక పుస్తకాన్ని టీడీపీ శుక్రవారం విడుదల చేసింది. మూడు రాజధానుల పేరుతో జగన్ మోసం చేశారని, నాసిరకం మద్యం అమ్మడం వల్ల ఆ మద్యం తాగి 30 వేల మంది చనిపోయారని, 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. ఉచిత ఇసుక రద్దు, విద్యుత్ చార్జీల పెంపుతోపాటు, జాబ్‌ క్యాలెండర్‌, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి జగన్ నెరవేర్చని ఎన్నికల హామీల గురించి ఈ పుస్తకంలో ప్రచురించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.