YS Jagan: పార్లమెంటులో ప్రైవేటు బిల్లులపై జగన్ ఫోకస్.. ప్రత్యేక హోదా బిల్లుపెట్టే యోచన..?

ప్రత్యేకహోదాతోపాటు ఇతర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ సిద్దమవుతున్నారు. అవసరమైతే.. ప్రత్యేక బిల్లులు ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రం పార్లమెంటులో అనేక బిల్లుల్ని ఆమోదించుకునే పనిలో ఉంది.

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 12:55 PM IST

YS Jagan: మరికొన్ని నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ కీలక అంశాలపై ఫోకస్ చేశారు. ప్రత్యేకహోదాతోపాటు ఇతర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్దమవుతున్నారు. అవసరమైతే.. ప్రత్యేక బిల్లులు ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రం పార్లమెంటులో అనేక బిల్లుల్ని ఆమోదించుకునే పనిలో ఉంది.

బిల్లులు ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతు చాలా అవసరం. పార్లమెంటులో అత్యధిక సీట్లు ఉన్న పార్టీల్లో వైసీపీ ఒకటి. అందుకే కేంద్రానికి వైసీపీ మద్దతు చాలా అవసరం. ఈ నేపథ్యంలో తమ మద్దతు కోరుతున్న బీజేపీపై ప్రత్యేక హోదా, విభజిత హామీల అమలు వంటి అంశాల్లో ఒత్తిడి తేవడానికి జగన్ సిద్ధమవుతున్నారు. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో జగన్ చర్చించారు. ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి ఒత్తిడి తేవాలని జగన్ భావిస్తున్నారు. అలాగే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధులను ఇప్పించడం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాల్లో కేంద్రాన్ని ప్రశ్నించాలని వైసీపీ భావిస్తోంది.

అవసరమైతే తమ పార్టీ ఎంపీలతో ప్రైవేటు బిల్లులను పెట్టించాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రైవేటు బిల్లులపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. అలాగే కేంద్రంపై ఒత్తిడి తేవడం వల్ల రాష్ట్రానికి నిధులు రాబట్టుకోవచ్చని, విభజన హామీలు నెరవేర్చుకోవచ్చని భావిస్తోంది. దీనివల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ప్రైవేటు బిల్లులు పెట్టడం, ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడం వల్ల పార్టీపై ఏపీలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అసలే ఇది ఎన్నికల సీజన్. ఇలాంటి సమయంలో పార్టీకి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తే అది వైసీపీ బలోపేతానికి పనికొస్తుంది.

ప్రత్యేక హోదా కోసం గతంలో గళమెత్తిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గాలికొదిలేసిందన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తుంటాయి. అయితే, తాజా వ్యూహంతో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పొచ్చని కూడా జగన్ భావిస్తున్నారు.