YSRCP: ఏపీలో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు వైసీపీ ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ఎన్నికల వరకు ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉండాలని ఫిక్సయ్యారు వైసీపీ అధినేత జగన్. దీనికి అనుగుణంగా సీఎం జగన్ వరుస కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే గడపగడపకు వైసీపీ వంటి కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ.. దసరా తర్వాత నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అక్టోబర్ 26 నుంచి సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభించబోతుంది.
నాలుగున్నర సంవత్సరాలలో సీఎం జగన్ ఏపీకి ఏం చేశారు.. ఆయన అందించిన సంక్షేమ ఫలాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరించబోతున్నారు. ఈ కార్యక్రమం గురించి వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. సీఎం జగన్ తన పాలనతో సామాజిక న్యాయం అంటే ఏమిటో ప్రజలకు చేసి చూపించారని సుబ్బారెడ్డి అన్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించి ప్రజల జీవన స్థితిగతులను మార్చిందన్నారు. ఏపీలో పేదరికం తగ్గడానికి జగన్ అమలు చేసిన నవరత్న పథకాలే కారణమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేశామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా గ్రామాల్లో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు వైద్యసేవలలు అందిస్తున్నట్లు చెప్పారు.
చట్ట సభలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల వరకూ.. అన్నింటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. సామాజిక న్యాయ బస్సు యాత్ర ఈ నెల 26న ఇచ్చాపురంలో ప్రారంభమవుతుంది. 27న విజయనగరం జిల్లా గణపతినగరంలో, 28న భీమిలిలో, 30న పాడేరులో, నవంబర్ 1న పార్వతీపురంలో, 2న మాడుగులలో, 3న పలాసలో, 4న ఎస్.కోటలో, 6న గాజువాకలో, 7న ఆముదాల వలసలో, 8న సాలూరులో, 9న అనకాపల్లిలో జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.