Pawan Kalyan: పవన్‌‌ను టార్గెట్ చేసిన వైసీపీ.. టీడీపీని పట్టించుకోని జగన్ అండ్ కో

ఏపీ రాజకీయం జనసేన వర్సెస్ వైసీపీగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం.. ఏపీలో జనసేన బలపడుతున్నట్లు కనిపించడమే. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర పేరుతో గోదావరి జిల్లాలుసహా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ యాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 12:25 PM IST

Pawan Kalyan: ఏపీ రాజకీయాలు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. అధికార వైసీపీ.. పవన్ కల్యాణ్‌నే టార్గెట్ చేసింది. టీడీపీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో రాజకీయం జనసేన వర్సెస్ వైసీపీగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం.. ఏపీలో జనసేన బలపడుతున్నట్లు కనిపించడమే. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర పేరుతో గోదావరి జిల్లాలుసహా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ యాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన వస్తోంది. వారాహి యాత్రలో ప్రభుత్వంపై పవన్ విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ప్రభుత్వానికి అనేక ప్రశ్నల సంధిస్తున్నారు. వైఫల్యాల్ని ఎండగడుతున్నారు. ఇక ఇటీవల వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఏ రకంగా చూసినా పవన్ పేరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. అటు పవన్ వ్యాఖ్యల ప్రభావం, ఇటు ఆయనకు జనంలో దక్కుతున్న ఆదరణతో వైసీపీలో భయం పెరిగిపోతుంది. దీంతో పవన్‌ను కార్నర్ చేసేందుకు జగన సహా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతారనే
పార్టీ పెట్టి చాలా కాలమే అవుతున్నా ఇంకా పూర్తిగా ప్రజల్లోకి వెళ్లలేదు. అందువల్ల గతంలో పవన్ ప్రభావం తక్కువగానే కనిపించేది. అయితే, ఇప్పుడు చేపట్టిన యాత్రతో పవన్‌కు, జనసేనకు మైలేజ్ పెరిగింది. ఎన్ని సీట్లు గెలుస్తారు అనే అంశం పక్కనపెడితే కచ్చితంగా రాబోయే ఎన్నికలను ప్రభావితం చేయగలరు. గెలుపోటములను నిర్ణయించగలరు. జనసేన ఫ్యాక్టరే రాబోయే ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తుంది. మరోవైపు జనసేనకు కాపు సామాజిక వర్గం అండ ఈసారి పుష్కలంగా ఉండబోతుంది. గతంలో పవన్‌ను పెద్దగా పట్టించుకోని కాపులు ఈ సారి అండగా నిలబడాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకాలం రెడ్డి లేదా కమ్మ సామాజిక వర్గం మాత్రం ఏపీలో రాజకీయ పెత్తనం చేస్తూ వచ్చింది. అందుకే కాపులతోసహా మిగతా సామాజికవర్గాల్లో అసంతృప్తి ఉంది. తమకు రాజకీయ ప్రాధాన్యం కావాలని కోరుతున్నారు. దీంతో వాళ్లను కూడా ఆకర్షించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యం బీసీలను కూడా ఆకట్టుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే వైసీపీకి మరింత ముప్పుగా మారొచ్చు. అందుకే వీలైనంతగా పవన్ ఇమేజ్ తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.
బలం పెంచుకునే ప్రయత్నం
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లోపు బలమైన శక్తిగా మారాలనుకుంటోంది. ఈ లోపు తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఈ జిల్లాల్లోని అన్ని సీట్లు గెలిచి సత్తా చాటాలనుకుంటోంది. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఎక్కువ సీట్లు అడగాలంటే పార్టీ బలంగా ఉండాలి. లేదంటే టీడీపీ ఇచ్చే తక్కువ సీట్లతోనే సర్దుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో జరిగే నష్టంపై పవన్ ఒక అంచనాతో ఉన్నారు. అందుకే పొత్తంటూ ఉంటే వీలైనన్ని ఎక్కువ సీట్లు అడిగే స్థాయికి జనసేనను బలపర్చడానికి ప్రయత్నిస్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే రెండు బలమైన సామాజికవర్గాల ఓట్ల వల్ల ఈ కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీడీపీ, జనసేన కలవకూడదని వైసీపీ అనుకుంటోంది.
పవన్‌పై వైసీపీ వ్యక్తిగత దాడి
టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటారనే అంశమే వైసీపీని కంగారు పెడుతుంటే.. ఇప్పుడు జనసేన బలం పెరగడం ఆ పార్టీకి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్‌పై ఎదురుదాడికి దిగుతోంది. పవన్ గురించి విమర్శించడానికి వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తోంది. మూడు పెళ్లిళ్లు, నాలుగు పెళ్లిళ్లు అంటూ పవన్ వైవాహిక జీవితాన్ని విమర్శిస్తోంది. సోషల్ మీడియా వేదికగానూ ఇదే ప్రచారం చేస్తోంది. చివరకు మూడో భార్య కూడా ఆయనను విడిచి వెళ్లిపోయిందంటూ వైసీపీ మీడియా, సోషల్ మీడియా కోడై కూసింది. దీనికి జనసేన ధీటుగా బదులిచ్చింది. ఇక ఎప్పట్లాగే కొందరు మంత్రులు పవన్‌పై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుతో లింక్ పేడుతూ, ప్యాకేజీ అంటూ పాతపాటే పాడుతున్నారు. తాజాగా వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వాళ్లతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనివల్ల పవన్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, రాజకీయం మొత్తం పవన్ చుట్టూనే తిరిగింది. ఇక టీడీపీ పెద్దగా చర్చలోనే లేకుండా పోయింది. ఈ విషయంలో పవన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కాగా, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరుగుతుండటంపై సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సహా పలువురు మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరో వీపీ సింగ్ అవుతారా..?
భారత రాజకీయాల్లో మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వీపీ సింగ్) ఒక చెరగని ముద్ర వేశారు. ఆయన రెండేళ్ల కాలమే ప్రధానిగా కొనసాగినా మిస్టర్ క్లీన్‌గా పేరు తెచ్చుకున్నారు. వీపీ సింగ్ ప్రధాని అయ్యేందుకు అనుసరించిన వ్యూహం రాజకీయాల్లో ఒక పాఠంగా చెప్పుకోవాలి. గతంలో కాంగ్రెస్ నేత అయిన వీపీ సింగ్ 1987లో బోఫార్స్ స్కామ్ విషయంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని విమర్శించారు. ఈ స్కాంకు వ్యతిరేకంగా ఆ పార్టీ నుంచి బయటికొచ్చి, జన్ మోర్చా పార్టీ స్థాపించారు. తాను ప్రధాని పదవి చేపట్టేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాడు. తనకు అనుకూలంగా ఉండే ఓటుబ్యాంకుపై దృష్టిపెట్టారు. వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో పర్యటించి, కొన్ని సామాజికవర్గాల ఓటు బ్యాంకును కొల్లగొట్టారు. అయితే, వీపీ సింగ్ పర్యటనను అడ్డుకునేందుకు రాజీవ్ గాంధీ ప్రయత్నించారు. ఆయన వెళ్లే విమానాలు ఆలస్యంగా నడిచేలా చేయడం వంటి పనులు చేశారు. దీంతో ఆయన రోడ్డు మార్గంలో కారులోనే వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇది ఆయన విజయానికి కలిసొచ్చింది. బలమైన కాంగ్రెస్ తరఫున ఉన్న రాజీవ్ గాంధీని ఓడించి, ప్రధాని అయ్యారు. రోడ్డుపై వెళ్తూ ప్రజలతో మమేకం కావడం, కొన్ని సామాజికవర్గాల ఓట్లు కొల్లగొట్టి రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు పవన్ కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని సామాజికవర్గాల ఓట్లపై ప్రత్యేక గురిపెట్టిన పవన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. పవన్ అనుకున్న లక్ష్యం నెరవేరితే మరో వీపీ సింగ్‌లా చరిత్ర సృష్టించడం ఖాయం.