తెలంగాణ రాజకీయాల్లో రాజ్‌భవన్ అనే అంశం చాలా వేడి ఎక్కిస్తుంది. మన్నటివరకూ కేసీఆర్, తమిళిసై మధ్య నడిచిన వ్యవహారం ఒక ఎత్తైతే ఇప్పుడు షర్మిల హాట్ టాపిక్ గా మారారు. ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య నువ్వా నేనా అన్న రేంజ్ లో ఫైట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కోర్టు జోక్యంతో ఈ గొడవ సద్దుమణిగింది. వైఎస్ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గారితో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాల పై వినతి పత్రం ఇవ్వనున్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం.. రాజ్ భవన్ నుంచే నేరుగా పాదయాత్రకు బయలు దేరనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. ఆగిన చోట నుంచే ప్రజా ప్రస్థానం స్టార్ట్ అవనుంది. నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి వైఎస్.షర్మిల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు.పాదయాత్రకు ఎక్కడైతే బ్రేక్ పడిందో అక్కడి నుంచే యాత్ర సాగనుంది. 4000 కిలో మీటర్ల మైలు రాయి వరకు షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. వరంగల్‌లో భారీగా పాదయాత్ర ముగింపు సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే 3,512 కిలో మీటర్ల వరకు షర్మిల పాదయాత్ర చేశారు. ముందుగా.. ఈనెల 28 నుంచి పాదయాత్ర చేస్తామని.., అందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సాఆర్టీపీ నేతలు పోలీసులను అనుమతి కోరారు. అందుకు వరంగల్ కమిషనర్ ఫిబ్రవరి 2 నుంచి పాదయాత్రకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద గతేడాది నవంబర్ 28న షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది. షర్మిల ప్రచార రథాన్ని కొందరు దగ్ధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు పాద యాత్రను అడ్డుకున్నారు. అనంతరం షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. తీవ్ర నాటకీయ పరిస్థితుల మధ్య ఆమె చేపడుతున్న పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. అయితే.. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా పాదయాత్రను ప్రారంభిస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఇలాంటి వాతావరణంలో మళ్లీ తిరిగి ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అన్న ఆలోచనలు రేకెత్తుతున్నాయి. గతంలో షర్మిలపై జరిగిన అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ పాదయాత్ర విజయవంతంగా సాగుతుందా అనేది అందరికీ ఉత్కంఠ రేకించే అంశం.