Zahirabad BRS: జహీరాబాద్‌పై ఆశలు వదులుకున్న బీఆర్ఎస్.. కారు దిగనున్న బీబీపాటిల్..!

జహీరాబాద్ లోక్‌‌సభ స్థానాన్ని లైట్ తీసుకున్నట్టు ఊహాగానాలు పెరుగుతున్నాయి. పైగా ఈ సారి జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి నాయకులు పెద్దగా ఆసక్తి చూపడంలేదట. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ కూడా కారు దిగుతారన్న వార్తలు జోరుగా వస్తున్నాయి.

  • Written By:
  • Updated On - February 20, 2024 / 04:26 PM IST

Zahirabad BRS: ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ పార్టీ కంచుకోట. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. తెలంగాణ ఏర్పడ్డాక మెదక్ జిల్లాపై మరింత పట్టు పెంచుకుంది BRS. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పవర్‌ పోయినా మెదక్ జిల్లాలో మాత్రం పట్టుతప్పలేదు. 10 నియోజకవర్గాలకుగాను 7చోట్ల గెలిచింది కారు పార్టీ. కానీ.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికే సగంసగంగా ఉందట వ్యవహారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి మెదక్, రెండోది జహీరాబాద్. ఈ రెండు చోట్ల ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌లే ఉన్నారు. మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఈసారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

YS SHARMILA: ఏపీలోనూ షర్మిల పని అయిపోయిందా..? పొలిటికల్ కెరీర్‌కు ఇక ఎండ్‌ కార్డేనా..?

దీంతో మెదక్‌ అభ్యర్థి వేటలో ఉంది పార్టీ. ఇక్కడ పార్టీ బలంగా ఉండటంతో టిక్కెట్‌ పోటీ కూడా ఎక్కువగా ఉంది. అది వేరే స్టోరీ. కానీ.. అసలు సమస్య అంతా జహీరాబాద్‌లోనే ఉందట. ఇక్కడ సీన్ మొత్తం రివర్స్‌లో ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. మెదక్ పార్లమెంట్ సీటు పరిధిలో ఇప్పటికే సన్నాహక సమావేశాలు ముగిశాయి. కానీ, జహీరాబాద్‌లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమం లేదు. ఈ పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సారి BRS రెండింటిని మాత్రమే గెలవగలిగింది. అందులో ఒకటి జహీరాబాద్, రెండోది బాన్సువాడ. ఈ లెక్కలతో పార్టీ జహీరాబాద్ లోక్‌‌సభ స్థానాన్ని లైట్ తీసుకున్నట్టు ఊహాగానాలు పెరుగుతున్నాయి. పైగా ఈ సారి జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి నాయకులు పెద్దగా ఆసక్తి చూపడంలేదట. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ కూడా కారు దిగుతారన్న వార్తలు జోరుగా వస్తున్నాయి. జహీరాబాద్ లోక్‌సభకి 2014లో జరిగిన ఎన్నికల్లో BRS లక్షా 44 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2019ఎంపీ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ 6 వేలకు పడిపోయింది. ఈ సారి అసెంబ్లీ స్థానాలు తక్కువగా గెలవడం, ఎంపీ బీబీ పాటిల్‌పై అటు స్థానిక నేతల్లో, ఇటు జనాల్లో వ్యతిరేకత ఉందన్నఅంచనాలతో లెక్కలు తప్పుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే జహీరాబాద్‌ను పార్టీ అగ్రనాయకత్వం కూడా లైట్‌ తీసుకుంటోందా అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి.

ముందు బలంగా ఉన్న మెదక్‌పై ఫోకస్ చేసి పట్టు నిలుపుకోవాలన్న ఆలోచనలో అగ్ర నాయకత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక.. జహీరాబాద్‌పై కూడా దృష్టి పెట్టే అవకాశముందంటున్నారు. అప్పటికిగాని బీబీ పాటిల్ పార్టీలో ఉంటారా..? మారతారా..? అన్న క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అలాగే ఎవరైనా ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిచూపితే వారిని కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కారణాలు ఏవైనా ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక బీఆర్‌ఎస్‌ క్యాడర్ మాత్రం అయోమయంలో ఉందట. మరి ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.