Zahirabad MP BB Patil: బీబీ పాటిల్‌కి అసమ్మతి సెగ .. మళ్ళీ సీటిస్తే కష్టమే !

మరోసారి ఆయనకే అవకాశం ఇస్తే ఆశలు వదులుకోవడమేనని అధిష్టానానికి చెబుతున్నారు. కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్స్‌కు చెందిన ముఖ్య నేతలు బీబీ పాటిల్‌కు టికెట్టు ఇవ్వొద్దని పార్టీ పెద్దలకు నేరుగానే చెప్పేస్తున్నట్టు తెలిసింది.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 02:53 PM IST

Zahirabad MP BB Patil: జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్‌కు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోంది. గత ఎన్నికల్లోనే అతి కష్టం మీద గెలిచిన పాటిల్‌ మరోసారి పోటీకి రెడీ అవుతుండగా కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మరోసారి ఆయనకే అవకాశం ఇస్తే ఆశలు వదులుకోవడమేనని అధిష్టానానికి చెబుతున్నారు. కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్స్‌కు చెందిన ముఖ్య నేతలు బీబీ పాటిల్‌కు టికెట్టు ఇవ్వొద్దని పార్టీ పెద్దలకు నేరుగానే చెప్పేస్తున్నట్టు తెలిసింది. అభ్యర్ధిని మారిస్తే ప్రయోజనం ఉంటుందని కూడా చెబుతున్నారు.

YS SHARMILA: దమ్ముంటే మోదీని ఇది అడుగు.. జగన్‌కు షర్మిల సవాల్‌..

ఇటీవల జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సమీక్షలో మొత్తం ఏడుగురు అసెంబ్లీ సెగ్మెంట్స్‌ ఇన్ఛార్జ్‌ల్లో ఐదుగురు ఎంపీకి వ్యతిరేకంగా ఫీడ్‌‌బ్యాక్‌ ఇచ్చారన్నది పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల టైంలో తన పరిధిలోని సెగ్మెంట్స్‌లో అంటీ ముట్టనట్లు వ్యవహరించారట పాటిల్‌. ఆయన కారణంగానే కేసీఆర్‌ పోటీ చేసిన కామారెడ్డితో పాటు జుక్కల్, ఎల్లారెడ్డి, అభ్యర్ధులు ఓడిపోయారన్నది స్థానిక నేతల వాదన. బాన్సువాడలో పోచారం సొంత ఇమేజ్‌తోనే గెలిచారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి ఆయనకు ఎంపీ టిక్కెట్‌ ఇస్తే తమ సహకారం ఉండబోదని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు తేల్చి చెప్పేసినట్టు తెలిసింది. దీంతో కింకర్తవ్యం అంటూ తల పట్టుకుంటున్నారట బీబీ పాటిల్‌. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కామారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు ఉన్నాయి. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం మధ్య చాలా కాలంగా గ్యాప్ ఉందంటున్నారు. ఎంపీగా పాటిల్‌ ఏమాత్రం కవర్‌ చేసే ప్రయత్నం చేయలేదన్నది లోకల్‌ టాక్‌.

ఇటు జహీరాబాద్, ఆందోల్, నారాయణ ఖేడ్ సెగ్మెంట్లలో.. అందోల్ మినహా మిగతా చోట్ల ఎంపీ మీద వ్యతిరేకత ఉందని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఎంపీకి జిల్లా నేతలతో సమన్వయం అంతగా ఉండదన్నది లోకల్‌ టాక్‌. ఆయన ఎక్కువ సమయం సంగారెడ్డి జిల్లాకు కేటాయిస్తారనీ.. తమను అస్సలు పట్టించుకోరంటూ కామారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంట్రిబ్యూషన్ పెద్దగా ఏమీ లేదన్నది పార్టీ స్థానిక నాయకులు అందరి మాటగా తెలిసింది. సిట్టింగ్‌ను మారిస్తేనే పరిస్థితి బాగుంటుందన్న ఫీడ్‌బ్యాక్‌తో పార్టీ పెద్దలు కూడా పునరాలోచనలోపడినట్టు ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌ ఎంపీని మారిస్తే.. ప్రత్యామ్నాయంగా కామారెడ్డి జిల్లాకు చెందిన బిల్డర్ తిమ్మన్న గారి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు, డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వీరితో పాటు ఆ పార్లమెంట్ పరిధిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారట. మొత్తంగా జహీరాబాద్ పార్లమెంట్ సీట్లో గులాబీ జెండా ఎగరాలంటే అభ్యర్ధి మార్పు తప్పదన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. పాటిల్ మాత్రం ఎంపీగా పోటీ చేసే సత్తా, అర్హత తనకే ఉన్నాయని అంటున్నట్టు తెలిసింది. హ్యాట్రిక్ కొడతారని ఆయన అనుచరులు ధీమాగా ఉన్నారట. అధిష్టానం మనసులో ఏముందో త్వరలోనే తేలిపోతుంది.