ఆ చిన్నారి మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను కలచివేసింది. కన్నీరు పెట్టించింది. బతకాలని ఆశ ఉన్నా.. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆపన్నహస్తం అందించినా.. 12 ఏళ్లకే చావు పలకరించింది ఆ చిన్నారిని. ఆ పాప ఎవరో కాదు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటలో ఉన్నప్పుడు స్వయంగా ఇంటికి వెళ్లి కలసిన రేవతి. పుట్టుకతోనే మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో పుట్టిన రేవతికి.. పుట్టుకే ఓ శాపంగా మారింది. పేరుకు ప్రాణం ఉన్నా ఆ చిన్నారి శరీరం తోలు బొమ్మతో సమానం. తనకున్న వ్యాధి కారణంగా ఒక్క అడుగు కూడా వేయలేదు. అతి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి.. రీసెంట్ గా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయింది. రేవతి మరణ వార్త విన్న జనసేనాని పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. రేవతితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. అడుగు వేయలేని స్థితిలో కూడా రేవతిలో ఉన్న పట్టుదల తనకు ఎంతో నచ్చిందంటూ ట్వీట్ చేశారు.
మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి చాలా అరుదు. అత్యంత ప్రమాదకరం కూడా. ఈ వ్యాధి వచ్చిన పిల్లల్లో ఎదుగుదల ఉండదు. శరీర కండరాలు మెల్లిమెల్లిగా పని చేయడం మానేస్తాయి. వ్యాధి ముదిరిక కొద్దీ ఒక్కో అవయవం పని చేయడం మానేస్తుంది. ఇలా వ్యాధి ముదురుతూ చివరికి ప్రాణం కూడా పోతుంది. అయితే వ్యాధి నయమయ్యే దారి లేకపోవడం అత్యంత బాధాకారమైన విషయం. డాక్టర్లు ప్రిఫర్ చేసే మందుల ద్వారా ప్రాణాన్ని కొంత కాలం కాపాడుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. దేవుడికి దయ లేదో.. లేక రేవతి తలరాతే అంతో తెలియదు కానీ.. పుట్టుకతోనే ఆ చిన్నారికి ఈ వ్యాధి ఉంది. రేవతి పుట్టిన సమయంలోనే ఆమె ఎక్కువకాలం బతకదని డాక్టర్లు చెప్పేశారు. కానీ ఆమె తల్లిందండ్రులు మాత్రం రేవతిని 12 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు.
ప్రతీక్షణం ప్రాణాన్ని హరిస్తున్నా.. ఎప్పుడు తన వ్యాధి గురించి రేవతి కానీ.. ఆమె తల్లిదండ్రులు కానీ బాధ పడేవారు కాదు. కాలు కూడా కదపలేని స్థితిలో ఉన్నా.. రేవతి కుటుంబం మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు. రేవతికి చదువు చెప్పించారు. తన వ్యాధితో పోరాడుతూనే రేవతి చదువుకుంటూ సంగీతం కూడా నేర్చుకునేది. ఆ చిన్నారికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానం. ఒక్కసారైనా తన అభిమాన నటుడిని కలవాలని కోరిక. రేవతి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్న సమయంలో రేవతి ఇంటికి స్వయంగా వెళ్లారు. చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేశారు. కాస్త సమయం వాళ్లతో గడిపాడు. రేవతి పాటలు పాడుతుంటే విన్నారు. చిన్నారికి ఓ ఎలక్ట్రిక్ వీల్ చైర్ కూడా కొనిచ్చారు. రేవతి చదువుకునేందుకు ఆర్థికంగా సహాయంగా ఉంటానంటూ హామీ ఇచ్చారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. శివరాత్రి రోజే రేవతి ఆ పరమ శివుడిలో ఏకమైపోయింది. రేవతి మరణ వార్త విన్న పవన్ కళ్యాణ్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. పుట్టినప్పుడే రేవతి ఎక్కువకాలం బతకదని డాక్టర్లు చెప్పినప్పటికీ 12 ఏళ్ల పాటు రేవతిని తల్లిదండ్రులు కాపాడుకున్నారంటూ ట్వీట్ చేశారు. అతి భయంకరమైన వ్యాధితో పోరాడుతూ రేవతి భగవద్గీతలోని 750 శ్లోకాలు కంఠస్థం చేసిందని తెలిసి చాలా సంతోషించానన్నారు. శివరాత్రి రోజునే రేవతి శివైక్యం కావడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. కేవలం జనసేనానిని మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను రేవతి మరణ వార్త షాక్ కు గురి చేసింది. పవన్ కళ్యాణ్ రేవతి ఇంటికి వెళ్లడంతో ఆ చిన్నారి గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసింది. రేవతి గురించి తెలిసిన ప్రతీ ఒక్కరూ ఆ చిన్నారికి వ్యాధి నయం కావాలని ప్రార్థించారు. కానీ రోజు రోజుకూ వ్యాధి ముదిరి చివరికి ఆ చిన్నారి ప్రాణం పోయిందని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు.