World Tour: 10ఏళ్ల వయసు.. 50 దేశాల పర్యటన.. ఒక్కరోజు కూడా స్కూల్ కు సెలవు పెట్టకుండా..

ప్రపంచం మొత్తం చుట్టేయాలని ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ వారి వారి ఆర్థిక, సామాజిక, వృత్తి, వ్యాపారాల దృష్ట్యా వీటిని వాయిదా వేసుకుంటూ ఉంటారు. కానీ ఒక పాప తన పదేళ్ల ప్రాయంలోనే 50కి పైగా దేశాలు చుట్టేసి ఎందరికో స్పూర్తిగా నిలుస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Updated On - July 22, 2023 / 04:32 PM IST

ఈ పాప పేరు అదితి త్రిపాఠి. వీరి తల్లిదండ్రులు ఇండియాకి చెందిన వారు. అయితే తమ కార్యకలాపాల దృష్ట్యా బ్రిటన్ లో నివాసం ఉంటున్నారు. త్రిపాటి తన మూడవ ఏట నుంచే ప్రయాణాలు చేయడం ప్రారంభించింది. ఈమె మొట్టమొదట సందర్శించిన దేశం జపాన్. ఇలా జపాన్ తో ప్రారంభమైన ఈమె సందర్శన నేపాల్, ఇండియా, థాయ్ లాండ్, సింగపూర్ వంటి దేశాల వరకూ విస్తరించింది. ఇక రానున్న రోజుల్లో ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా చూసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈమె తండ్రి దీపక్ త్రిపాఠి అవిలాష అనే బ్యాంకులో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. ఇతను సౌత్ లండన్లో తన భార్యతో పాటూ పిల్లలతో కలిసి ఉంటారు.

ఈమె పర్యటనలపై తండ్రి దీపక్ స్పందిస్తూ.. ‘చిన్న వయసులోనే ఇన్ని దేశాలు తిరగడం వల్ల అక్కడి పరిస్థితులు, వ్యక్తులు, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుస్తుంది. అలాగే సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. ఈ పర్యటనలు తన కూతురు భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ టూర్ల నేపథ్యంలో ఇప్పటి వరకూ త్రిపాఠి ఒక్క రోజు కూడా స్కూల్ కి సెలవు పెట్టలేదనన్నారు. ఇదే ఇక్కడ అత్యంత ప్రాముఖ్యతను, ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఏ ప్రాంతానికి వెళ్లాలో ముందుగానే నిర్ణయించుకుని శుక్రవారం సాయంత్రమే తన చిన్నారిని స్కూల్ నుంచి నేరుగా ఎయిర్ పోర్ట్ చేరుకునేలా ప్లాన్ చేస్తారు. ఇలా పర్యటనలు అన్నీ ముగించుకొని ఆదివారం రాత్రి 11 గంటలకల్లా హోమ్ టౌన్ చేరుకునేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకూ ఒక్క రోజు ఆప్సెంట్ కూడా తన స్కూల్ రిజిస్టర్లో నమోదు కాలేదని అంటున్నారు. ఇలా తిరిగేందుకు సంవత్సరానికి 20 వేల పౌండ్లు అవుతుందట’. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 21 లక్షలకు పైచిలుకు అనమాట. ఇంత ఖర్చు చేసే ఈ కుటుంబ సభ్యులకు సొంతకారు కూడా లేకపోవడం గమనార్హం. ఎక్కడికి వెళ్ళాలన్నా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నే వినియోగిస్తారట.

Aditi Tripathi, Traveled to 50 countries at the age of 10 years

ఇక అమ్మాయి విషయానికొస్తే నేను ఇప్పటి వరకూ చాలా దేశాలు తిరిగాను అని తన పర్యటన అనుభవాలను పంచుకున్నారు. నేపాల్, అర్మేనియా, జార్జియా అంటే తనకు ఎంతో ఇష్టంగా తెలిపారు. ఎందుకంటే ఈ దేశాల్లో తనకు నచ్చిన ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ ప్రయాణాల్లో భాగంగానే ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించా అని తన తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్శనలో భాగంగా అనేక విషయాలు, విజ్ఞానంతో పాటూ వినోదాన్ని కూడా పొందినట్లు త్రిపాఠి వివరించింది.

T.V.SRIKAR