అప్పటి వరకు సమాజంలో ఒకడిగా ఉన్న వ్యక్తి.. ఉన్నట్టుండి ఒంటరిగా మారిపోతే.. రోజుల తరబడి సమాజానికి దూరంగా ఒంటరి జీవితాన్ని గడపాల్సి వస్తే అతని జీవితం ఎలా ఉంటుంది.. శారీరంగా మానసికంగా ఎలాంటి మార్పులు జరుగుతాయి.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు చేసిన ప్రయత్నమే ఆమెను 500 రోజుల పాటు గుహలో ఉండేలా చేసింది.
50 ఏళ్ల వయసులో ఒంటరి ప్రయోగం
స్పెయిన్‌కు చెందిన పర్వతారోహకురాలు ఫ్లామినీ వయస్సు 50 సంవత్సరాలు. కొండలు, గుట్టలు ఎక్కడమంటే ఆమెకు ఎంతో సరదా. హ్యూమన్ ఎక్స్ పర్మెంట్ లో భాగంగా ఒంటరిగా చీకటి గుహలో ఉండేందుకు ముందుకొచ్చింది. దాదాపు 230 అడుగల లోతులో ఉన్న గుహలో ఒక్కతే 500 రోజుల పాటు ఉండి రికార్డు సృష్టించింది. 2021 నవంబర్ 20న గుహలోకి ప్రవేశించిన ఫ్లామినీ ఇటీవలే గుహ నుంచి బయటకు వచ్చింది. ఆమె గుహలో ఉన్న సమయంలోనే యుక్రేయిన్ వార్ మొదలైంది. క్వీన్ ఎలిజిపెత్ చనిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవన్నీ ఆమెను ఏమాత్రం కలచివేయేలేదు. గుహలోకి వెళ్లేందుకు ఆమె పెద్ద సంకల్పమే తీసుకుంది. చివరకు తన కుటుంబ సభ్యులు చనిపోయినా తనకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని మొండిగా చెప్పేసింది.
అన్ని రోజులు గుహలో ఏం చేసింది ?
చుట్టూ మనుషులు ఉన్నా.. అన్ని సౌకర్యాలు కళ్లముందే ఉన్నా ఒక్కోసారి మనం బోర్ కొట్టినట్టు ఫీల్ అవుతాం. కానీ ఈమెకు అలాంటిదేమీ లేదు. 48 సంవత్సరాల వయసున్నప్పుడు గుహలోకి ప్రవేశించిన ఫ్లామినీ రెండు పుట్టిన రోజులను ఒంటరిగానే చేసుకుంది. చుట్టూ బండరాళ్ల మధ్య ఒంటరిగా ఉండటానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. ఫ్లామినీకి ధైర్యం చాలా ఎక్కువ. దోమలు, ఈగలు, పురుగుపుట్ర గుహలోకి ఏమి వచ్చినా సరే ఆమె అక్కడే అలాగే ఉంది. వంట చేసుకోవడం, డ్రాయింగ్ , పెయింటింగ్ వేయడం ఇలా అనేక పనులు చేస్తూ కాలక్షేపం చేసేంది. ఆమెతో పాటు కొన్ని ప్రత్యేకమైన పరికరాలను గుహలోకి పంపించిన శాస్త్రవేత్తల బృందం 500 రోజుల ఒంటరి ప్రయాణంలో ఆమెలో కలిగిన మార్పులను నమోదు చేశారు. ఆమె మానసిక స్థితి ఎలా ఉందో అంచనా వేశారు. సమాజం నుంచి దూరంగా జరిగినప్పుడు వ్యక్తుల మెదడు ఎలా స్పందిస్తుంది అన్న అంశాన్ని కూడా అధ్యయనం చేశారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తనలో తానే పెద్దగా మాట్లాడుకునేది. ఒక్కోసారి మౌనంగా పనిచేసుకుంటూ ఉండేది. అయితే ఆమెలో ఎక్కడా భయాన్ని గుర్తించలేదు పరిశోధకులు.
500 రోజుల గ్యాప్ తర్వాత బయట ప్రపంచాన్ని చూసిన ఫ్లామినీ గుహలోకి వెళ్లేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతే ఉత్సాహంగా కనిపించారు. ఒంటరిగా ఉండాలన్నది ఫిక్స్ అయినప్పుడు ఇక భయమెందుకంటారు ఆమె. తన శరీరాన్ని వైద్యులు పరీక్షించుకోవచ్చని.. మరో ప్రయోగానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. మొత్తానికి వాలంటరీగా 500 రోజుల పాటు గుహలో ఒంటరిగా గడిపి కొత్త చరిత్ర సృష్టించారు ఈ స్పెయిన్ మహిళ.