Onion Prices: ఇప్పటికే టమోటా, పచ్చిమిర్చి సహా వివిధ నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యలపై మరో భారం పడనుంది. త్వరలోనే ఉల్లిపాయల ధరలు పెరగబోతున్నాయి. వచ్చే నెల నుంచే ఉల్లిధరలు పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉల్లిగడ్డల సరఫరా తగ్గిపోయింది.
ఈ నెలాఖరుకు ఉల్లి సరఫరా ఇంకా తగ్గుతుంది. దీంతో నెమ్మదిగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40 వరకు ఉన్న ధరలు ఈ నెలాఖరుకు రూ.60 నుంచి రూ.70 వరకు చేరే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో రూ.90, అంతకుమించి పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్‌లో ఉల్లి ధరల పెరుగుదల ప్రారంభమైతే.. అక్టోబర్‌లో కొత్త ఉల్లి మార్కెట్లోకి వచ్చే వరకు ధరలు పెరుగుతూనే ఉంటాయంటున్నారు. అంటే కనీసం రెండు నెలలపాటు ధరల పెరుగుదల ఉంటుది.
సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఉల్లి కొనాలి అంటే సామాన్యులు జేబు బరువు మరింత పెంచుకోవాల్సిందే. ఇటీవలి సీజన్‌లో ఉల్లికి సరైన ధర లేని కారణంగా ఈసారి రైతులు తక్కువ సంఖ్యలోనే ఉల్లి పండిస్తున్నారని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే వచ్చే సీజన్‌లో కూడా ఉల్లి లభ్యత తగ్గి, ధరలు ఎక్కువగానే ఉండొచ్చు. ఈ ఏడాది వరకు 8 శాతం ఉల్లి ఉత్పత్తి తగ్గితే.. వచ్చే సీజన్‌లో 5 శాతం తగ్గుతుంది. వార్షిక ఉల్లి ఉత్పత్తి 5 శాతం వరకు ఉండొచ్చు. అన్నింటికీ మించి సెప్టెంబర్‌లో వర్షం ఆధారంగా రాబోయే ఉల్లి దిగుబడి ఆధారపడి ఉంటుంది.
మండుతున్న టమాటా..
టమాటా ధర ఇప్పట్లో దిగొచ్చే అవకాశం లేదు. సాధారణంగా ఆగష్టులో అన్ని రకాల పంటలు చేతికొస్తాయని, దీంతో కూరగాయలు ధరలు తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, ఈసారి టమాటా సహా ఇతర పంటలు ఇప్పట్లో చేతికొచ్చే అవకాశం లేదని, దీంతో మరికొంతకాలం కూరగాయల ధరల మోత తప్పదని చెబుతున్నారు. ప్రస్తుతం టమోటాతోపాటు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇతర కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. టమోటా ధర హోల్‌సేల్ మార్కెట్లోనే కేజీ రూ.200 పలుకుతోంది. త్వరలోనే రూ.300 మార్కు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
గత సీజన్‌లో కురిసిన అకాల వర్షాలకు టమోటా పంట దెబ్బతింది. దీంతో ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణం. మరోవైపు బియ్యం ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గత ఖరీఫ్ సీజన్‌లో తగినంత దిగుబడి లేకపోవడం వల్ల బియ్యం ఉత్పత్తి తగ్గింది. దీంతో బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వం బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ బియ్యం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ధరల పెరుగుదలలో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉల్లి వంటి పంటలను నిల్వచేసేందుకు ఆధునిక పద్ధతులు పాటిస్తే ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.