AI Anchor: ఏఐ యాంకరమ్మ… ఎవరి పొట్ట కొట్టబోతోంది ?

అన్ని రంగాలను వేగంగా ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్రమంగా మనిషి స్థానాన్ని ఆక్రమించడం మొదలు పెట్టింది. ఏ మనిషి చేతిలో నైతే పురుడు పోసుకుందో ఆ మనిషి అవసరం లేకుండానే అన్ని పనులను పూర్తి చేయగల స్థాయికి కృత్రిమ మేథస్సు చేరుకుంది.

  • Written By:
  • Updated On - July 12, 2023 / 12:44 PM IST

పాన్ ఇండియా తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. స్టేజ్‌పై నవ్వులు పూయిస్తూ యంగ్ అండ్ ఎనర్జటిక్‌‌గా ఈవెంట్‌ను కండెక్ట్ చేసే మన పాపులర్ యాంకరమ్మ సుమ అక్కడ కనిపించదు. సుమ బదులు ఝాన్సీ ఉందా అంటే ఆమె కూడా ఉండదు. వాళ్ల స్థానంలో వాళ్ల కంటే అందమైన ఏఐ రూపొందించిన అమ్మాయి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేస్తుంది. మరో సందర్భంలో తెలుగు పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ షో జబర్దస్త్‌లో యాంకర్ రష్మీ కనిపించదు. ఆమె ప్లేస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన యాంకరమ్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. రాజకీయ నేతల ఇంటర్వ్యూల నుంచి ఎన్నికల ఫలితాలను విశ్లేషించే వరకు ఇకపై అంతా కృత్రిమ మేథస్సు నుంచి పుట్టుకొచ్చిన యాంకర్లు ఆ పని పూర్తి చేసేస్తాయి.
మానవ మేథస్సుకే సవాలు విసురుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పతనాన్ని వివరించేందుకు ఇవన్నీ కేవలం ఉదాహరణలుగా చెబుతున్నవి కావు. భవిష్యత్తులో జరగబోతున్నది ఇదే. అన్ని రంగాలను వేగంగా ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్రమంగా మనిషి స్థానాన్ని ఆక్రమించడం మొదలు పెట్టింది. ఏ మనిషి చేతిలో నైతే పురుడు పోసుకుందో ఆ మనిషి అవసరం లేకుండానే అన్ని పనులను పూర్తి చేయగల స్థాయికి కృత్రిమ మేథస్సు చేరుకుంది.
కొన్ని రోజుల క్రితం ఒడిశాకు చెందిన OTV నెట్ వర్క్ తొలిసారిగా AI యాంకరమ్మతో వార్తలు చదివించింది. ఇంగ్లీష్, ఒడియా భాషల్లో అనర్గళంగా వార్తలు చదువుతూ యాంకర్ లీసా పాపులర్ అయిపోయింది. తాజాగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా Big Tv నుంచి కూడా మాయ పేరుతో ఏఐ న్యూస్ రీడర్ యూట్యూబ్ స్క్రీన్లపై ప్రత్యక్షమయ్యింది. స్టూడియోలో పొందికగా కూర్చొని తెలుగులో వార్తలు చదువుతున్న మాయ కొన్ని గంటలకే వైరల్ గా మారిపోయింది. వాస్తవానికి ఏఐ అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలోనే చైనా సహా అనేక దేశాలు ఏఐ ప్రజెంటర్లతో ప్రయోగాలు చేశాయి. కాకపోతే ఇప్పుడవి మన న్యూస్ రూమ్స్ వరకు వచ్చాయి. సమీప భవిష్యత్తులో మోదీ, బరాక్ ఒబామా, కేసీఆర్ లాంటి ప్రముఖులను పోలిన ఏఐ అవతారాలు కూడా వార్తలు చదివి వినిపించినా ఆశ్చర్యం లేదు. ఏఐకున్న పవర్ అలాంటిది మరి.


AI మనిషిని రీప్లేస్ చేయబోతోందా ?
కొన్ని ప్రశ్నలు అతిశయోక్తులుగానే ఉంటాయి. కానీ కాలక్రమంలో ఊహించని పరిణామాలు కళ్ల ముందు కనిపించిన తర్వాత అవి అతిశయోక్తులు కావు వాస్తవాలు అన్న విషయం అర్థమవుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం కంప్యూటర్ వాడకం మొదలు పెట్టినప్పుడు యావత్ మానవ సమాజం భయంతో వణికిపోయింది. భవిష్యత్తులో అన్ని పనులు కంప్యూటరే చేస్తుంది కాబట్టి ఇక హ్యూమన్ వర్క్ ఫోర్స్ అవసరం ఉండదని ప్రపంచం భావించింది. ఇందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. కంప్యూటర్ టెక్నాలజీ మనిషి ప్రయాణాన్ని ఊహించని మలుపు తిప్పింది. అయితే కంప్యూటర్ రంగ ప్రవేశం చేయగానే మనిషి చేసే ఉద్యోగాలన్నీ ఊడిపోలేదు. పైగా కొత్త అవకాశాలు పుట్టుకొచ్చాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుందా అంటే కచ్చితంగా అవును అని, కాదు అని చెప్పలేం. ఎందుకంటే మనిషి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన కృత్రిమ మేథస్సు.. ఆ మనిషి కంటే వేగంగా ఆలోచిస్తూ సూపర్ ఇంటెలిజెన్స్‌గా తయారైపోయింది. మనకు ఏం కావాలో చెబితే చాలు.. అలా నడుచుకునే సత్తా ఏఐ టెక్నాలజీకి ఉంది. లీసా, మాయా లాంటి ఏఐ యాంకర్లు చూడగానే అందరికీ ముచ్చటేస్తుంది. మనిషిని పోలిన కృత్రిమ ఆకారం వార్తలు చదవుతున్నా.. ఇంటర్వ్యూలు చేస్తున్నా.. డిబేట్లలో పాల్గొంటున్నా అంతా కొత్తగా అనిపిస్తుంది. అయితే ఈ ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ మరింతగా చొచ్చుకుపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న
ఏఐ ఆటోమెషన్ మనిషిని పక్కకు నెట్టేస్తుందా ?
ఈ మధ్య సాంకేతికరంగ నిపుణులు ఎక్కువగా మాట్లాడుకుంటుంది ఏఐ ఆటోమెషన్ గురించే. అందుబాటులో ఉన్న టూల్స్‌కు ఏఐను జోడించడం ద్వారా ఊహించని ఫలితాలు ఎలా సాధ్యమో ఇప్పటికే అన్ని రంగాలు చూస్తున్నాయి. ఇప్పటికే మనిషి మనుగడ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఏఐ ఆటోమేషన్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంటే ఆ పరిణామాలు హ్యూమన్ వర్క్ ఫోర్స్ మీద కచ్చితంగా పడతాయి. ఉదాహరణకు మీడియారంగంలో చర్చనీయాంశంగా మారిన లీసా, మాయ వంటి ఏఐ యాంకర్ల గురించే మాట్లాడుకుందాం. తాము ఏఐ టెక్నాలజీని అందరి కంటే ముందే అందిపుచ్చుకున్నామని.. మిగతా మీడియాతో భిన్నంగా ఏఐతో న్యూస్ ప్రజెంట్ చేస్తున్నామని ఆయా సంస్థలు చెప్పుకుంటున్నాయి. ప్రయోగ దశలో ఇవన్నీ ఆసక్తిగానూ, కొత్తగానూ అనిపిస్తాయి. క్రమేపీ ఈ టెక్నాలజీ మొత్తం రంగాన్ని ప్రభావితం చేయడం మొదలు పెట్టినప్పుడు ఆయారంగాల మౌలిక స్వరూపమే పూర్తిగా మారిపోతుంది. లీసా, మాయ రూపంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్తలు చదవడమే కాదు.. న్యూస్‌ను సేకరించడం మొదలు.. స్క్రిప్ట్ రాసుకోవడం, వాటిని ప్రజెంట్ చేయడం వరకు అన్ని పనులను ఏఐ చేసేస్తే.. ఆ ప్రభావం ఆయారంగాల్లో పనిచేస్తున్న హ్యూమన్ వర్క్ ఫోర్స్‌పై ఎంతగా ఉంటుందో ఆలోచించాలి


ఉద్యోగాల కోత ఏఐ పుణ్యమేనా ?
కోవిడ్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదుటపడి గాడినపడటం మొదలు పెట్టిన కొంతకాలానికే మాంద్యం పేరుతో బడా సంస్థలన్నీ ఉద్యోగాల్లో కోతలు విధించడం మొదలుపెట్టాయి. బయటకు రెసిషన్ అని పేరు చెప్పినా.. వాస్తవానికి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగాల కోతల్లో ఎక్కువ భాగం ఏఐతో ముడిపడి ఉన్నవే. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం వంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేయడం మొదలు పెట్టిన తర్వాత ఉద్యోగాల్లో కోత విధించడం పెరిగిపోయింది. ఇవన్నీ కాకి లెక్కలు కావు. అమెరికాకు చెందిన ఛాలెంజర్ గ్రే అనే సంస్థ లే ఆఫ్స్‌పై సేకరించిన డేటా ప్రకారం ఈ ఏడాది మేలో అమెరికాలో ఉద్యోగాల కోత విధించిన అన్ని రంగాలపై ప్రత్యక్షంగా ఏఐ ప్రభావం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తమ సంస్థ కార్యకలాపాలకు ఇంటిగ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టిన కంపెనీలు హ్యూమన్ వర్క్ ఫోర్స్‌పై వేటు వేస్తున్నాయ.. ఒక్క మే నెలలోనే అమెరికాలో 5 శాతం ఉద్యోగాలను హరించి వేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ప్రమాదకారిగా మారనంత వరకే
చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ మధ్య కాలంలో చేసిన ప్రకటనలు వింటే గుండె జారిపోతుంది. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మనుగడకే ప్రమాదకరంగా మారడం ఖాయమని ఆ సంస్థ ఇప్పటికే ఎన్నో సార్లు హెచ్చరించింది. ఇంకా చెప్పాలంటే సూపర్ ఇంటెలిజెన్స్‌గా మారిపోయిన ఏఐ మనిషిని అంతం చేసే స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది ఆ సంస్థ ప్రకటన సారాంశం. నిజంగా ఇలా జరుగుతుందా అంటే కాదని చెప్పలేం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనిషి తన పురోగతికి ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాడు. కానీ ఏఐతో విస్తృత ప్రయోగాలు నిర్వహిస్తూ దాని వాడకాన్ని పెంచుకుంటూ పోయే కొద్దీ ప్రతి అడుగులోనూ మనిషికి సవాల్ విసురుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్సిషన్ పిరియడ్‌లో ఉంది. అందువల్ల దీని ప్రభావం సమాజంపై అనుకూలంగానూ, కొంత ప్రతికూలంగానూ ఉంటుంది. అయితే ఏఐ అన్నది వ్యవస్థీకృతంగా మారిన తర్వాత మాత్రమే దాని అసలు ప్రభావం ఏమేరకు ఉంటుందన్నది తెలుస్తుంది. అప్పటి వరకు చాట్ జీపీటీలు, లీసాలు, మాయలు మనల్ని ఉత్సాహపరుస్తూనే ఉంటాయి.