Tony Fernandes: వర్చువల్ మీటింగ్‌లో అర్ధనగ్నంగా మసాజ్ చేయించుకున్న సీఈవో వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఉన్నతహోదాలో ఉండి అలాంటి పనిచేయడమేంటని ఫైర్ అవుతున్నారు. ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండేజ్ తాజాగా లింక్డ్ ఇన్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో షర్ట్ లేకుండా మసాజ్ చేయించుకుంటూ ఉన్న ఒక ఫొటో కూడా షేర్ చేశాడు. అలాగే మేనేజ్‌మెంట్ మీటింగ్‌లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చాడు.
ఎయిర్ ఏసియా పని సంస్కృతిలో ఇదొక భాగమని, ఈ వారమంతా ఒత్తిళ్లతో గడిచిందని, మసాజ్ చేయించుకుంటే రిలీఫ్ దొరుకుతుందని అలా చేసినట్లు చెప్పాడు. ఈ మీటింగ్‌లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇదంతా బాగానే ఉన్నా.. ఒక కీలకమైన వర్చువల్ మీటింగ్‌లో షర్ట్ లేకుండా ఉండటం.. పైగా అందరిముందూ మసాజ్ కూడా చేయించుకోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒక బాధ్యతాయుత హోదాలో ఉండి ఇలా అభ్యంతరకరంగా ప్రవర్తించడం సరైందేనా అని ప్రశ్నిస్తున్నారు. చేసే పని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు కానీ, మరి ఇంతలా కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది చాలా అతిగా ఉందంటున్నారు. నెటిజన్ల ఇన్ని విమర్శలు వస్తున్నా టోని ఫెర్నాండేజ్ ఈ పోస్టును డిలీట్ చేయలేదు.
పైగా కామెంట్లను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. లింక్డ్ ఇన్‌లోనే కాకుండా.. ఎక్స్‌లో కూడా ఈ పోస్టుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, తామెంత కష్టపడుతున్నామో, పనికోసం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో చెప్పేందుకే ఈ పోస్టు చేసినట్లు టోని ఫెర్నాండేజ్ తెలిపారు.