Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున బంగారం కొనకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతోంది?

అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం షాపుల ముందు జనం క్యూ కడుతుంటారు. శక్తికొద్దీ ఎంత వీలైతే అంత బంగారం కొంటారు. ఆ రోజున ఎంతో కొంత బంగారం కొనాలని మహిళలు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ రోజు బంగారం కొంటే మంచిదన్న ప్రచారం కొన్నేళ్లుగా సాగుతోంది.

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 05:16 PM IST

Akshaya Tritiya: అక్షయ తృతీయ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బంగారమే. ఆ రోజు ఎంతో కొంత బంగారం కొనాలనేది సెంటిమెంట్. నిజంగా అక్షయ తృతీయ రోజు కచ్చితంగా బంగారం కొనాలా? అసలీ సంప్రదాయం ఎక్కడ్నుంచి వచ్చింది? శాస్త్రం ఏం చెబుతోంది?
అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం షాపుల ముందు జనం క్యూ కడుతుంటారు. శక్తికొద్దీ ఎంత వీలైతే అంత బంగారం కొంటారు. ఆ రోజున ఎంతో కొంత బంగారం కొనాలని మహిళలు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ రోజు బంగారం కొంటే మంచిదన్న ప్రచారం కొన్నేళ్లుగా సాగుతోంది. దీంతో అక్షయ తృతీయ రోజున షాపులు కిక్కిరిసిపోతున్నాయి. ఆ రోజు డెలివరీ తీసుకునేలా ముందుగానే బుకింగ్‌లు కూడా చేస్తున్నారు. అయితే నిజానికి శాస్త్రంలో ఎక్కడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని లేదు. అక్షయ తృతీయ రోజున దానం చేయమని చెబుతోంది శాస్త్రం. కానీ పసిడి కొనమని ఎక్కడా చెప్పలేదు.
అక్షయ తృతీయనాడు బంగారం కొనాలా?
వైశాఖ మాసంలో శుద్ధ తదియనాడు అక్షయ తృతీయ జరుపుకొంటారు. అక్షయ అంటే క్షయం కానిది అర్థం. ఆ పవిత్రమైన రోజున ఏ పనిచేసినా అది విజయవంతం అవుతుందని నమ్ముతారు. ఏ పుణ్యకార్యం చేసినా దాని ఫలితం అక్షయంగా ఉంటుందని పండితులు చెబుతారు. ఆ రోజున అక్షయుడైన విష్ణుమూర్తిని పూజిస్తారు. త్రేతాయుగం మొదలైంది, పరశురాముడు పుట్టింది అక్షయతృతీయ రోజునే. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి మనతోనే ఉండిపోతుందని చాలామంది నమ్ముతారు. కానీ నిజానికి శాస్త్రంలో ఎక్కడా అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని లేదు. ఆ రోజున ఏ దానం చేసినా దాని ఫలితం విశేషంగా ఉంటుందని మాత్రమే శాస్త్రం చెబుతోంది. బంగారం కొనుగోలు చేయడం కంటే దానం చేయడం ఉత్తమం. అయితే అందరికీ బంగారం దానం చేసే స్తోమత ఉండదు కాబట్టి ఏదో ఒకటి దానం చేయమని చెబుతారు. మనం దానం చేయడం వల్ల వచ్చే పుణ్యం అపారం. అయితే ఆ రోజు మంచిరోజు కాబట్టి కొంతమంది బంగారం కొనడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. తర్వాత దాన్నే సంప్రదాయంగా మార్చేశారు. వ్యాపారాన్ని పెంచుకునేందుకు కొందరు ఓ క్రమపద్ధతిలో చేసిన ప్రచారమే అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయడం. గతంలో ఇంత వెర్రి ఉండేది కాదు. కానీ గత పదేళ్లుగా ఈ ట్రెండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. అసలు దానం చేయాలి అని శాస్త్రాల్లో ఉంటే జనం మాత్రం బంగారం కొనడానికి మొగ్గుచూపుతున్నారు.


ఆ రోజు బంగారం కొంటే ఏమవుతుంది?
భారతీయులకు బంగారం అంటే మక్కువ. అది కేవలం ఆభరణమే కాదు.. ఆపదలో ఆర్థికంగా ఆదుకునే ఆపద్బంధువు కూడా. అందుకే మన పెద్దలు ఎప్పుడు అవకాశం ఉన్నా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయమని చెప్పేవారు. అది ఇంట్లో ఉంటే ఓ భరోసా. అంతేకాని ఖచ్చితంగా ఫలానా రోజు కొనుగోలు చేయమని చెప్పలేదు. అప్పుచేసి కొనుగోలు చేయమని అసలు చెప్పలేదు. నిజానికి ఆ రోజు బంగారం కొనడం మంచిది కాదని మరికొందరు చెబుతారు. కలిపురుషుడి ఐదు నివాస స్థానాల్లో బంగారం ఒకటన్నది వాదన. బంగారం అహంకారానికి హేతువు అంటారు. అంటే ఆ రోజు బంగారాన్ని కొనుగోలు చేసి కలిపురుషుడ్ని ఇంటికి ఆహ్వానించడమే అంటున్నారు పండితులు.

దానం చేయాలని శాస్త్రం చెబుతుంటే దానికి వ్యతిరేకంగా అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసి దాయడం మంచిది కాదంటున్నారు మరికొందరు పండితులు.
ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరిగింది. జీవనకాల గరిష్ఠస్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి అక్షయ తృతీయనాడు బంగారం కొనాలన్న సెంటిమెంట్‌కు పోకండి. అవకాశం ఉంటే కొనుక్కోండి. లేకపోతే లేదు. ఆ రోజు కొనకపోతే జరిగే నష్టమేమీ లేదు. అక్షయతృతీయ నాడు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుందనుకుంటే అది భ్రమ మాత్రమే.
బంగారాన్ని ఇలా కొనుక్కోండి!
మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు పసిడిని కొనుక్కోండి. కానీ అక్షయతృతీయ రోజునే కొనాలి అనే సెంటిమెంట్‌ను ఫాలో కాకండి. అలాగే ప్రస్తుత రోజుల్లో బంగారాన్ని నేరుగా కొనాల్సిన పనిలేదు. డిజిటల్‌ గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. రూపాయి మొదలు ఎంతపెట్టైనా దీన్ని కొనొచ్చు. కావాలనుకున్నప్పుడు కొనొచ్చు.. అమ్మొచ్చు! లేదా బంగారం రూపంలో ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందులో తయారీ ఖర్చులు ఉండవు. ఇక గోల్డ్‌ ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో యూనిట్ల వారీగా పసిడిని కొనొచ్చు. లేదా ప్రభుత్వ పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఏటా రెండున్నరశాతం చొప్పున వడ్డీ వస్తుంది. ప్రస్తుత రోజుల్లో రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేకపోయామే అని ఆందోళన చెందకండి. మండువేసవిలో మంచినీటి నుంచి ఏది దానం చేసినా అది మీకు పుణ్యమే. బంగారం కొనడంకన్నా.. దానం చేయడమే ఉత్తమం.