Amaravati Stupa‎: బౌద్ధుల చరిత్రకు చిరునామా.. ఏపీకి తలమానికం.. అమరావతి బౌద్ధ స్థూపం!

ఏపీలోని అమరావతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయం పేరు మీదుగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చింది. ఇక్కడ బౌద్ధ, జైన మతాలు విలసిల్లేవి. దాదాపు 1900 సంవత్సరాల క్రితం ఇక్కడ బౌద్ధ స్థూపం నిర్మితమైందని చరిత్రకారులు చెబుతున్నారు

Amaravati Stupa: దేశమంతా శుక్రవారం బుధ్ద పూర్ణిమ (బౌద్ధ పౌర్ణమి)ని ఘనంగా జరుపుకోబోతుంది. అత్యంత విశిష్టమైన పౌర్ణమిల్లో ఇదీ ఒకటిగా చెబుతారు. అలాగే భారతీయ చరిత్రలో బుద్ధుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు దేశంలో ఒక వెలుగువెలిగింది బౌద్ధమతం. అనేక ప్రాంతాల్లో బౌద్ధం ఆనవాళ్లు కనిపిస్తాయి. ఏపీలోని అమరావతిలోనూ బౌద్ధానికి ఒకప్పుడు చాలా ప్రాధాన్యం ఉండేది. గుంటూరు జిల్లాలోని అమరావతి ప్రాంతంలో బౌద్ధ మతం విరాజిల్లింది. అందుకే ఏపీకి నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. అక్కడ బుద్ధుడి స్మారకార్థం భారీ బౌద్ధ స్థూపం కూడా నిర్మితమైంది. ఈ నేపథ్యంలో బుద్ధ పూర్ణిమ, అమరావతిలోని బౌద్ధ స్థూపం విశేషాలు తెలుసుకుందాం.
గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైన రోజు పౌర్ణమి. ఉత్తరాయణంలో వచ్చే మూడో పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానోదయమైంది. అందుకే ప్రతి ఏటా బుద్ధుడి జ్ఞాపకార్ధం ఆ రోజును బౌద్ధ పౌర్ణమిగా జరుపుకొంటారు. హిందువులతోపాటు బౌద్ధులు కూడా ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహిస్తారు. యోగ సంస్కృతిలో, ఆధ్యాత్మిక సాధనలో ఈ రోజు చాలా ప్రత్యేకమైందని చెబుతారు. బుద్ధుడు నిర్యాణమై 2,500 సంవత్సరాలు గడిచినా ఆయన చూపిన మార్గం ఇప్పటికీ అనుసరణీయమే. ఇంతకాలమైనా ఆయన చరిత్ర నేటి తరాన్ని కూడా కదిలిస్తోంది. ఎందరో ప్రజలు బుద్ధుడిని అనుసరించారు. బౌద్ధాన్ని ఆచరించారు. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో బుద్ధుడి విగ్రహాలు, చరిత్ర కనిపిస్తుంది. బౌద్ధం ఎక్కువగా వికసించిన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతం ఒకటి. ప్రస్తుతం ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఇదే ప్రాంతాన్ని ఏపీ రాజధాని అమరావతిగా అభివృద్ధి చేశారు. బుద్ధుడి ఆనవాళ్ల స్ఫూర్తిగా ఇక్కడ భారీ బుద్ధుడి విగ్రహం కూడా కనిపిస్తుంది.


చారిత్రక అమరావతి
ఏపీలోని అమరావతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయం పేరు మీదుగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చింది. ఇక్కడ బౌద్ధ, జైన మతాలు విలసిల్లేవి. దాదాపు 1900 సంవత్సరాల క్రితం ఇక్కడ బౌద్ధ స్థూపం నిర్మితమైందని చరిత్రకారులు చెబుతున్నారు. బుధ్దుడికి సంబంధించిన అవశేషాలను సంరక్షించి, నిర్మించిందే అమరావతి బౌద్ధ స్థూపం. బౌద్ధాన్ని ఆచరించే వాళ్లకు ఈ స్థూపం స్మారక చిహ్నంగా ఉండేది. శాతవాహనులు, ఇక్ష్వాకులు అమరావతిని అభివృద్ధి చేయడంతోపాటు, బౌద్ధస్థూపాన్ని రక్షించినట్లు తెలుస్తోంది. ఈ స్థూపాన్ని 1797లో కొలిన్ మెకెంజీ అనే చరిత్రకారుడు కొనుగొన్నాడు. అమరావతి నగరాన బౌద్ధులు విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారట. ఈ స్థూపం సాంచి స్థూపంకంటే పొడవైనది. దీనినే మహాస్థూప, దీపాలదిన్నె అనికూడా అంటారు. ఈ ప్రాంతానికి ఇంతటి చారిత్రక నేపథ్యం ఉండటం వల్ల ఏపీకి నూతన రాజధానికి అమరావతి అనే పేరు పెట్టారు. భారీ బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.