Marriage Registration Fees: వివాహ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిన ఏపీ ప్రభుత్వం.. అంతా ఆన్‌లైన్‌లోనే..

ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజుల్ని భారీగా పెంచినప్పటికీ.. వివాహాల నమోదు ప్రక్రియను సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లోనే సులభంగా దీనికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 08:22 PM IST

Marriage Registration Fees: వివాహాల్ని రిజిష్టర్ చేయించుకోవాలనుకునే జంటలకు షాకిచ్చింది ఏపీ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం 1955 హిందూ వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించి 1965 మార్చిలో జారీ చేసిన ఫీజులను సవరిస్తూ జీవో విడుదల చేసింది. ఇప్పటివరకు వివాహ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 ఉండగా, దానిని రూ.500కు పెంచింది.

CM REVANTH REDDY: రేవంత్‌తో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కోమటిరెడ్డి మాటే నిజం అవుతుందా..?

ఆఫీసు బయట జరిగే వివాహాల వద్దకే సబ్ రిజిస్ట్రార్ వచ్చి, మ్యారేజ్ రిజిష్టర్ చేయించాలంటే.. ఆ ఫీజును ఏకంగా రూ.5 వేలకు పెంచింది. ఇంతకుముందు ఈ ఫీజు రూ.210గా ఉండేది. ప్రస్తుత ఏడాదిలో వివాహాల రికార్డుల పరిశీలనకు రూపాయిగా ఉన్న ఫీజును కూడా రూ.100కు పెంచింది. సెలవు రోజుల్లో వివాహాలు నమోదు చేయాలంటే ఇకపై ఫీజుగా రూ.5 వేలు సమర్పించుకోవాల్సిందే. హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలకు వేర్వేరుగా ఫీజులు వసూలు చేస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం కాకుండా జరిగే వాటిని ప్రత్యేక వివాహాలుగా పరిగణిస్తారు. ప్రభుత్వం ఫీజుల్ని భారీగా పెంచినప్పటికీ.. వివాహాల నమోదు ప్రక్రియను సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లోనే సులభంగా దీనికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఇది ప్రయోగాత్మకంగా అమలవుతున్నప్పటికీ.. త్వరలోనే పూర్తిస్థాయిలో, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది ప్రభుత్వం. గతంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం నేరుగా ఆఫీసుకు వెళ్లి, ఆధార్ కార్డులు, పెళ్లి ఫొటోలు, పెండ్లి పత్రిక సమర్పించి, సాక్షి సంతకాలు చేయించాల్సి వచ్చేది. ఇకపై ఇందులో చాలా వరకు ఆన్‌లైన్‌లోనే చేయొచ్చు. www.registrations.ap.gov.in సైట్ లాగిన్ అవ్వాలి.

అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి, నిర్దేశిత ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలి. సంబంధిత కాపీని సబ్ రిజిస్ట్రార్‌కు అందజేస్తే, మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ప్రస్తుతం అనేక ప్రభుత్వ పథకాలకు, విదేశాలకు వెళ్లేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరమనే సంగతి తెలిసిందే. పెళ్లి అవ్వగానే అందరూ దీనికోసం దరఖాస్తు చేసుకుంటారు. వచ్చే నెలలో ఎక్కువ పెళ్లిళ్లకు ఎక్కువ ముహూర్తాలున్నాయి. దీంతో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. వీళ్లంతా రిజిష్టర్ చేయించుకుంటే.. ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.