ANDHRA PRADESH: ఏపీలో కులగణన.. నవంబర్ నుంచి ప్రారంభం..!

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. ఏపీ వ్యాప్తంగా వచ్చే నవంబర్ 15 నుంచి కుల గణన చేపట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై సీఎం జగన్‌ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు నవంబర్‌ 15 తర్వాత కులగణన చేపట్టాలని నిర్ణయించారు.

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 06:12 PM IST

ANDHRA PRADESH: కుల గణన అంశం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని వివిధ పార్టీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ, దీనికి కేంద్రం మాత్రం అంగీకరించడం లేదు. కులగణన కాదు కదా.. కనీసం జనాభా లెక్కలు కూడా చేయడం లేదు. మరోవైపు బిహార్ ప్రభుత్వం మాత్రం అక్కడ కులగణన పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వివరాల్ని కూడా విడుదల చేసింది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో రాష్ట్ర ప్రభుత్వం కుల గణనకు సిద్ధమవుతుండటం సంచలనం కలిగిస్తోంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. ఏపీ వ్యాప్తంగా వచ్చే నవంబర్ 15 నుంచి కుల గణన చేపట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై సీఎం జగన్‌ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు నవంబర్‌ 15 తర్వాత కులగణన చేపట్టాలని నిర్ణయించారు. కుల గణన ప్రారంభమవడానికి ముందు కుల సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి, సలహాలు స్వీకరించబోతుంది. నవంబర్ 15న ప్రారంభించే కులగణనను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అంటే వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లోగా పూర్తి చేయాలని భావిస్తోంది. దీనికోసం ప్రత్యేక యాప్ కూడా తీసుకురాబోతుంది. ఇప్పటికే కుల గణన ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వాలంటీర్లతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ద్వారా ఈ సర్వే చేపడతారు. సచివాలయాల ఉద్యోగులు ఆయా సచివాలయాల పరిధిలో ఉండే ఇంటింటికి వెళ్లి, వివరాలు సేకరిస్తారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సేకరించిన వివరాలను మండలస్థాయిలో అధికారులు రీవెరిఫికేషన్ చేస్తారు. సచివాలయ పరిధిలోని 10 శాతం చొప్పున ఇళ్లల్లో ఈ రీ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం మూడో దశలో.. మొదటి రెండు స్థాయుల్లో జరిగిన సర్వేపై ఆర్‌డీవో ఆధ్వర్యంలో వెరిఫికేషన్‌ ఉంటుంది. ఇలా మూడు దశల్లో సర్వే చేసిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది సర్కారు. ఇక బిహార్‌లో కుల గణన పూర్తికాగా.. పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కూడా కులాల వారీగా సర్వే చేపట్టాయి. ఈ సర్వే చేపడుతున్న నాలుగో రాష్ట్రంగా ఏపీ నిలవనుంది.