iPhones‎: ఆ పని చేస్తున్నారా..? అయితే, జాగ్రత్త.. ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరిక..!

ఐఫోన్ పట్టుకుని పడుకోవడం, లేదా పక్కన ఉంచుకుని నిద్రపోవడం చేయకూడదని ఐఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అందులోనూ ఫోన్ చార్జింగ్ పెట్టి, దగ్గర అస్సలు పడుకోకూడదని సూచించింది. ఇదేమీ కొత్త హెచ్చరిక కాదు.

  • Written By:
  • Updated On - August 25, 2023 / 04:49 PM IST

iPhones: ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోకూడదని సూచించింది. అందులోనూ.. ఫోన్ చార్జింగ్ పెట్టి, దాని దగ్గరే అస్సలు నిద్రపోవద్దని యూజర్లను హెచ్చరించింది. ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోకూడదని చాలా మంది చెప్పే మాటే. ఫోన్ రేడియేషన్ కారణంగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఈ విషయాన్ని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి కూడా. తాజాగా ఇదే అంశంపై ఐఫోన్ యూజర్లను యాపిల్ హెచ్చరించింది.

ఐఫోన్ పట్టుకుని పడుకోవడం, లేదా పక్కన ఉంచుకుని నిద్రపోవడం చేయకూడదని ఐఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అందులోనూ ఫోన్ చార్జింగ్ పెట్టి, దగ్గర అస్సలు పడుకోకూడదని సూచించింది. ఇదేమీ కొత్త హెచ్చరిక కాదు. ఐఫోన్ యూజర్ గైడ్‌లో కూడా ఈ విషయం ఉంటుంది. యాపిల్ సూచన ప్రకారం.. ఐఫోన్ చార్జింగ్ విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. సరైన వెంటిలేషన్ ఉన్న గదుల్లోనే చార్జింగ్ పెట్టాలి. అందులోనూ ఫ్లాట్‌గా ఉండే ప్రదేశాల్లోనే చార్జింగ్ చేయాలి. అంటే టేబల్స్, టీపాయ్స్ వంటివే వాడాలి. అలాగే పిల్లోస్, బెడ్ షీట్స్‌తోపాటు ఐఫోన్ ఒళ్లో పెట్టుకుని ఛార్జింగ్ చేయకూడదు.
సాధారణంగా చార్జింగ్ సమయంలో ఐఫోన్లు వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ వేడి ఎప్పటికప్పుడు బయటకు వెళ్తుండాలి. అలా కాకుండా చుట్టూ ఉన్న వాతావరణం వల్ల.. లేదా ఫోన్‌ను చుట్టి ఉండే ఇతర ప్రభావాల వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. ఫోన్లు కాలిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు పేలుళ్లు కూడా జరగొచ్చు. అగ్ని ప్రమాదాలకు దారితీయొచ్చు. చాలా మంది తమ తలగడ కింద ఫోన్ చార్జింగ్ పెట్టి నిద్రపోతుంటారు. ఫోన్ చార్జింగ్ పెట్టినా.. లేదా వాడకుండా ఉన్నా.. పిల్లో కింద ఫోన్లు ఉంచకూడదు. దీనివల్ల ఐఫోన్ల నుంచి ఉత్పత్తయ్యే వేడి అలాగే ఉండిపోయి, ప్రమాదానికి దారితీయొచ్చు. ఇలా పిల్లోల కింద, క్లోజ్డ్ సర్ఫేస్‌లలో ఛార్జింగ్ పెట్టకూడదని సూచిస్తోంది యాపిల్.

“ఐఫోన్ డివైజ్‌పై, అడాప్టర్‌పై, వైర్‌లెస్ ఛార్జర్‌పై నిద్రపోకూడదు. అలాగే బ్లాంకెట్ కింద, పిల్లో కింద ఐఫోన్ ఉంచి ఛార్జింగ్ చేయకూడదు. ఫోన్ పక్కన పెట్టుకుని, శరీరం కింద ఉంచుకుని ఛార్జింగ్ పెట్టొద్దు. ఐఫోన్, వైర్‌లెస్ ఛార్జర్, అడాప్టర్ వంటివాటిని దూరంగా, వెంటిలేషన్ ఉన్న చోట మాత్రమే ఛార్జింగ్ చేసుకోవాలి. వేడి ప్రదేశాలకు దూరంగా ఉండాలి” అని యాపిల్ సంస్థ తమ వినియోగదారులకు నేరుగా సందేశం పంపింది.