ఒకప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌కు క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఎంత ఎత్తులో ఉంటే.. అంత స్టైల్ అని ఫీల్ అవుతున్నారు జనాలు. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్. హైదరాబాద్‌లోనే 30 నుంచి 40 అంతస్తుల భవనాలు దాదాపు 100దాకా ఉన్నాయ్. కొన్ని భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా.. కొన్ని నిర్మాణంలో.. మరికొన్ని ప్రణాళికల దశలో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాజేంద్ర నగర్ సర్కిల్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో.. 50అంతస్తుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయ్. హైరైజ్ బిల్డింగ్స్‌లో ఉండడం హోదాకు చిహ్నంగా భావిస్తున్న చాలా మంది.. వాటిలో పోటీపడి ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.
ఇలా వెంచర్ ప్రకటించగానే.. పునాదులు వేయకుండానే.. అలా వాటిలో ఫ్లాట్లను హాట్‌కేకుల్లా కొనేస్తున్నారు. ఈ అభివృద్ధిని ఆపడం అసాధ్యం. ఇలాంటి హైరైజ్ బిల్డింగ్‌లు అందరికీ సూట్ కావని.. కొంతమందికి ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు… కొందరికి శ్వాస సమస్యలు వస్తుంటాయ్. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలి పల్చబడి… ఆక్సిజన్ స్థాయులు తగ్గడమే దీనికి కారణం. ఐతే ఆరోగ్యవంతుల శరీరాలు.. మారే వాతావరణ పరిస్థితికి అనువుగా మారుతాయి. శరీరం ఇలా సర్దుబాటు చేసుకోవడాన్ని ఎక్లైమెటైజేషన్ అంటారు.
ఈ సామర్థ్యం అందరికీ ఒకేలా ఉండదు. వ్యక్తుల వయసు, ఆరోగ్యం వంటివి ఈ సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. ఆస్తమా వంటి సమస్యలున్నవారికి ఎక్లైమెటైజేషన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. అలాంటివారు 30అంతకు మించి అంతస్తులుండే భారీ భవనాల్లో ఎక్కువకాలం ఉంటే హైపోక్సియా బారిన పడే ప్రమాదం ఉంది. హైపోక్సియా అంటే శరీరంలోని కణాలకు తగినంత ప్రాణవాయువు అందకపోవడం. హైపోక్సియా వల్ల.. శ్వాస పీల్చుకోవడం కష్టం అవుతుంది. హృదయ స్పందన వేగం, రక్తపోటు పెరుగుతాయ్. ఎక్కువగా రాత్రిపూట ఇలాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. దీర్ఘకాలంపాటు హైపోక్సియాకు గురయ్యేవారిలో.. ఆ ప్రభావం గుండె ఆరోగ్యంపైనా పడుతుందని… నిద్రలేమి వంటి సమస్యలు చుట్టుముడతాయని చెప్తున్నారు.
గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, హృద్రోగాలతో, శ్వాససమస్యలతో బాధపడేవారికి.. ఈ సమస్య ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 8వేల అడుగులు అంటే దాదాపు 80 అంతస్తులు అంతకుమించి ఎత్తైన భవనాల్లో నివసించేవారిలో ఈ ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయ్. ఊపిరి ఆడకపోవడం, అలసట, తలనొప్పి వంటి ఇబ్బందులు వస్తాయ్. కొన్ని సందర్భాల్లో వారి మెదడు పనితీరుపైనా ప్రభావం పడుతుంది. 10వేల అడుగులు దాటితే.. ముందే రకరకాల అనారోగ్యాలతో బాధపడే వృద్ధుల్లో ఈ ముప్పు మరింత పెరుగుతుందని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు. నిజానికి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకుగాను.. హైరైజ్ భవనాలు నిర్మించేటప్పుడు.. వాయు నాణ్యతను నియంత్రించే అత్యంత అధునాతన విధానాలను బిల్డర్లు పాటిస్తుంటారు.
అలాంటివి పాటించకుండా నిర్మించే భవనాల్లో.. శ్వాసకోశ, గుండె సంబంధిత జబ్బులున్న వారు 30కి మించి అంతస్తుల్లో ఎక్కువకాలం నివాసం ఉంటే వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎత్తైన భవనాల్లో నివసించేవారిలో 50 ఏళ్లు దాటిన మహిళలు హైబీపీ బారిన పడే ముప్పు ఎక్కువని ఆ పరిశోధనలో తేలింది. అయితే, దీనికి కారణం ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉండడం కాదు. కేవలం జీవనశైలి సమస్య. అంత ఎత్తున ఉండేవారు పదేపదే కిందకి దిగలేరు. దిగాలంటే తప్పనిసరిగా లిఫ్ట్ వాడాల్సిందే. ఫలితంగా వారు ఎక్కువకాలం అలా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది.
బయటకు వెళ్లి పచ్చిగాలి పీల్చి, కాసేపు అలా తేలికపాటి వ్యాయామాలు చేసే అవకాశం ఉండదు. ఒక ఇరుకైన ప్రదేశంలో ఎక్కువకాలం ఉన్న భావనతో వారిలో ఆందోళన పెరుగుతుంది. దీన్ని ‘సెల్ఫ్ ఇండ్యూస్డ్ క్యాబిన్ ఫీవర్’ అంటారు. కాబట్టి, ఎత్తైన భవనాల్లో ఉన్నా కొద్దిగా ఓపిక చేసుకుని కిందకు వెళ్లి వాకింగ్, జాగింగ్ వంటివి చేయడం.. నలుగురితో కలిసి మాట్లాడడం వంటివి చేస్తే మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. శ్వాస సమస్యలతో, హృద్రోగాలతో బాధపడేవారు ఆకాశహర్మ్యాల్లో ఉండాలనుకుంటే… ఫ్లాట్ కొనాలనుకుంటే.. వైద్యులను ఒకసారి సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.