సైబర్ మోసగాళ్ళు రోజు రోజుకీ తెలివిమీరుతున్నారు. టెక్నాలజీని (Technology) వాడుకుంటూ జనాన్ని బురిడీ కొట్టిస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ (Smart phone) వాడుతున్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ ఉంటుంది. ఈ వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలంటూ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సలహా ఇస్తోంది.
ఈమధ్యకాలంలో చాలా మందికి తెలియని నంబర్ల నుంచి వాట్సప్ మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. రెండు, మూడు రింగ్స్ వచ్చాక ఆ కాల్ ఆగిపోతుంది. చాలా మంది వీటిని పట్టించుకోరు. కానీ హ్యాకర్స్ (Hackers) మాత్రం యాక్టివ్ వినియోగదారులను గుర్తించడానికి ఇలా మిస్డ్ కాల్స్ చేస్తుంటారని BPRD చెబుతోంది. ఇలాంటి వాళ్ళని గుర్తించి చిన్నగా ట్రాప్ లోకి లాగుతున్నారు కేటుగాళ్ళు. ఎక్కువగా +254, +63, +1(218)తో స్టార్ట్ అయ్యే నెంబర్ల నుంచే మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. ఇవి వియత్నం, కెన్యా, ఇథియోపియా, మలేసియా (Malaysia) దేశాలకు చెందిన నెంబర్లు. ఇలాంటి వాటిని అస్సలు లిఫ్ట్ చేయొద్దంటున్నారు పోలీసులు.
ఈమధ్య స్టాక్ మార్కెట్ (Stock Market) లో పెట్టుబడులకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళని టార్గెట్ గా చేసుకొని… ట్రేడింగ్ లో మంచి నైపుణ్యం ఉందంటూ వాట్సాప్ కి మెస్సేజ్ లు పెడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. తమ సూచనలు పాటిస్తే… విపరీతంగా లాభాలు వస్తాయని నమ్మిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్ లో లేని యాప్స్ APK లింక్స్ పంపుతున్నారు. అందులో ఖాతా ఓపెన్ చేయించి… భారీగా పెట్టుబడులు పెట్టేలా మోటివేట్ చేస్తున్నారు. ప్రారంభంలో కొంత లాభాలు చూపిస్తున్నారు. తర్వాత పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడితే… ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు. మరికొందరు దిగ్గజ కంపెనీల ఉద్యోగులమంటూ కాల్స్ చేస్తున్నారు. తాము చెప్పిన వస్తువులను అమ్మితే బోల్డన్ని లాభాలు వస్తాయని నమ్మించి… డబ్బులు కట్టించుకుంటున్నారు. తర్వాత వస్తువులేమీ పంపకుండా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు.
మీకు మంచి ఉద్యోగం… రోజుకు 2 వేలు, రోజుకు 3 వేలు ఇస్తామంటూ వచ్చే మెస్సేజ్ లకు అయితే లెక్కే లేకుండా పోతోంది. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, వర్క్ ప్రం హోమ్ ఇలా ఉద్యోగాల పేరుతో వాట్సాప్ మెస్సేజ్ లు పంపుతున్నారు. వీటిని కూడా నమ్మొద్దనీ… ఆ మెస్సేజ్ లకు రిప్లయ్ ఇవ్వొద్దని BPRD హెచ్చరిస్తోంది. వాట్సాప్ లో ఈమధ్య వచ్చిన స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ను కూడా సైబర్ క్రిమినల్స్ వాడుకుంటున్నారు. వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది. దాంతో మన మొబైల్ లోని బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. ఇవే కాకుండా… OLXలో వస్తువుల అమ్మకం, ఇల్లు రెంట్ కి తీసుకుంటాం మీ అకౌంట్ నెంబర్ చెప్పమని, ఫెడెక్స్ కొరియర్ నుంచి మీ పేరున విదేశాలకు అక్రమంగా డ్రగ్స్ సప్లయ్ అవుతున్నాయనీ, లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతోనూ మోసాలు జరుగుతున్నాయి.
పర్సనల్, హోమ్ లోన్స్ లాంటి వాటికి ముందుగా ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాలని అడిగితే… అది తప్పకుండా మోసమేనని గుర్తించండి. లాటరీ టిక్కెట్లు, 49 రూపాయలకే కలర్ టీవీ లాంటి ప్రకటనలు కూడా అస్సలు నమ్మొద్దంటున్నారు పోలీసులు. సైబర్ క్రిమినల్స్ వలలో పడకూడదంటే… పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం బెటర్. అలాగే మనకు సంబంధం లేని లింక్స్ వస్తే క్లిక్ చేయొద్దు. వార్షికోత్సవ ఆఫర్లు, ఫ్రీ ల్యాప్ టాప్ లు, కేంద్ర ప్రభుత్వం ఆఫర్లు అంటూ వచ్చే కాల్స్, మెస్సేజ్ లకు స్పందించరాదు. బ్యాంక్ అకౌంట్స్ పాస్ వర్డ్స్, ఇతర కీలక సమాచారం మొబైల్ లో ఉంచకపోవడమే బెటర్. పాస్ వర్డ్స్ రెగ్యులర్ గా మారుస్తూ ఉండాలి. వాట్సాప్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలనీ… తెలియని నెంబర్ల నుంచి కాల్స్, మెస్సేజ్ లు వస్తే… వాటిని బ్లాక్ చేయాలని… అస్సలు పట్టించుకోవద్దని పోలీస్ శాఖ సూచిస్తోంది. బ్యాంక్ అకౌంట్స్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల డిటైల్స్ అస్సలు చెప్పవద్దని సలహా ఇస్తున్నారు.