Ayyappa Swamy Devotees: కేరళ రాష్ట్రంలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వాములు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్వాముల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురుస్వాములు నాయని బుచ్చిరెడ్డి, బాలకృష్ణ, రాధాకృష్ణ మాట్లాడారు.
REVANTH REDDY: మొన్న జీవన్ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్.. బీఆర్ఎస్‌లో టెన్షన్
శబరి గిరీశుడి దర్శనానికి లక్షలాదిగా వెళుతున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వ అధికారులు తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులపై వివక్ష ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో శబరిమలకు వెళ్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఇరు రాష్ట్రాల భక్తులు క్షేమంగా స్వామిని దర్శించుకుని, తిరిగి ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ను సైతం కలిసి విన్నవిస్తామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే అయ్యప్ప స్వాములు నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు.
శబరిలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
తెలంగాణ నుంచి వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు. శబరిలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేరళ సీఎంతో మాట్లాడి అయ్యప్ప స్వామి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా చూడాలని సూచించారు. “తెలంగాణ నుంచి శబరి వెళ్తున్న అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కేరళ వెళ్ళే భక్తులను అక్కడి ప్రభుత్వం దోచుకుంటుంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరం అయితే వారికోసం అక్కడ తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలి” అని రాజాసింగ్ డిమాండ్ చేశారు.