BALAPUR LADDU: బాలాపూర్‌ లడ్డూ ఎందుకు అంత ఫేమస్‌.. వేలం డబ్బులను ఏం చేస్తారు..?

నిమజ్జనం రోజు ఉదయం ఏడు గంటలకు దరఖాస్తులను ముగిస్తారు. వేలం పాట వెయ్యి రూ.116తో ప్రారంభమవుతుంది. లడ్డూను దక్కించుకున్న వారు బాండ్ పైన సంతకం చేయాలి.

  • Written By:
  • Publish Date - September 28, 2023 / 05:08 PM IST

BALAPUR LADDU: వినాయక చవితి అంటే.. అందరూ మాట్లాడుకునేది రెండింటి గురించే ! ఒకటి.. ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు.. రెండు బాలాపూర్ లడ్డూ ధర విషయాలు. బాలాపూర్ లడ్డూ వేలం రోజు పొద్దున నుంచే సందడి కనిపిస్తుంది. వినాయక చవితి మొదటి రోజు నుంచే పోటీ పడుతున్న వారి దరఖాస్తులు తీసుకుంటారు. నిమజ్జనం రోజు ఉదయం ఏడు గంటలకు దరఖాస్తులను ముగిస్తారు. వేలం పాట వెయ్యి రూ.116తో ప్రారంభమవుతుంది. లడ్డూను దక్కించుకున్న వారు బాండ్ పైన సంతకం చేయాలి.

బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లో ప్రారంభమైంది. లడ్డూ వేలం పాట మాత్రం 1994లో 450 రూపాయలతో మొదలైంది. లడ్డూను పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్మకం. నమ్మకమే కాదు.. దీనిని వేలంలో దక్కించుకున్న వారు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు కూడా ! లడ్డూ వేలంపాట మొదలైన 17 సంవత్సరాలు.. స్థానికులకే అవకాశం కల్పించారు. ఆ తర్వాత స్థానికేతరులకు అవకాశం ఇస్తున్నారు. ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. 27లక్షల రూపాయలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి.. లడ్డూ సొంతం చేసుకున్నారు. దయానంద్‌ది తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పాటిగూడ గ్రామం.

ఈయన వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ! ఈసారి వేలంతో కలిసి. బాలాపూర్‌ లడ్డూ పాట 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏటా ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి కనిపించింది. ఐతే ఈసారి కూడా రికార్డు స్థాయిలోనే పోయింది. గతేడాది 24 లక్షలకు వేలం పాటలో పోయింది. ఈసారి వేలంపాటలో 36మంది పాల్గొన్నారు. వీళ్లలో ముగ్గురే స్థానికులు ఉన్నారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలం పాటతో వచ్చిన డబ్బులు ఏం చేస్తారు అనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఐతే ఈ డబ్బులను మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారు. బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొంత మొత్తంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలు నిర్మించారు.

స్థానికులే కాదు స్థానికేతరులు ఈ లడ్డూ వేలంపాటలో పాల్గొనడం ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు రావడం ద్వారా గ్రామానికి మరింత ఖర్చు చేస్తున్నారు. 2022 లెక్కలు చూస్తే.. వేర్వేరు అభివృద్ధి పనుల కోసం బాలాపూర్ ఉత్సవ సమితి ఖర్చు చేసింది. స్థానిక దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణకు 2022లో దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారు. బాలాపూర్‌లోని జిల్లా పరిషత్‌ పాఠశాలకు.. లక్షన్నర రూపాలతో సమితి ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించారు. 75వేలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌ వరద బాధితులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. దేవుడి లడ్డూ ద్వారా వచ్చిన డబ్బులను.. జనాల బాగు కోసమే ఉపయోగించాలనే మంచి లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందుకే లడ్డూ కొన్న వాళ్లకు, పూజలు చేసిన వాళ్లకు కూడా మంచి ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.