బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందేముంటుంది. మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడుతానని తాను బయటకు చెప్పుకున్నా.. నోటిదూల అంటారు దాన్నే అభిమానులు ! ప్రతీసారి ఏదో మాట జారడం… అది రచ్చ రచ్చకావడం.. తన మార్క్ సారీ చెప్పడం.. బండ్ల బాబుకు కామన్ అయింది ఈ మధ్య! అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేశ్.. ఆ తర్వాత త్రివిక్రమ్ పంచాయితీతో తెగ ట్రోల్ అయ్యాడు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం, ఇటు అభిమానులంతా శోకసంద్రంలో ఉంటే.. మళ్లీ తన నోటి దూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా !
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి దగ్గర చుట్టం. దీంతో అన్నీ తానై అన్నట్లుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలానే వ్యవహరించారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేశ్ కు నచ్చలేదట ! ప్రాణంపోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని మాట్లాడనని… అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని అదే తన నైజం అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన విచిత్రం అని.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని.. బతికితే సింహంలా బతకాలి.. చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ.. చంద్రబాబు, విజయసాయి పక్కపక్కనే కూర్చొని ఉన్న ఫొటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్.
ఈ పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఆయన బంధువు.. ఆమెకు ఈయన బంధువు.. చావు జరిగిన ఇల్లు.. ఓదార్చడానికి వచ్చారు.. ఇందులో తప్పు వెతికినే నిన్ను ఏమనాలి బండ్ల అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి, చంద్రబాబు రాజకీయాల్లో బద్ద శత్రువులే కావొచ్చు.. పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు.. రెండింటిని కలిపి చూసే నిన్న ఏమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావ్ సిగ్గు లేదా అనే వారు ఇంకొందరు.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడుతావో తెలియని నీకు.. ఆ ఇద్దరి మాట్లాడే స్థాయి ఉందా.. మైండ్ దొబ్బిందా అని ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలని వివాదాలు క్రియేట్ చేస్తారో.. వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ.. ప్రతీసారి ఏదో ఒక రచ్చలో భాగం అవుతుంటారు బండ్ల. తారకరత్న చనిపోయి.. ఆ కుటుంబం పుట్టెడు దుఖంలో ఉంది.. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర.. ఇలా రాజకీయాలు మాట్లాడడం.. కరెక్ట్ కాదు బండ్ల.. ఏమైనా నోటి దూల, చేతి దూల తగ్గించుకోవాలి నువ్ అంటూ.. రియాక్షన్స్ వినిపిస్తున్నాయ్.