Gurbani Telecast Row: గుర్బానీ ప్రసార హక్కులపై వివాదం.. అసెంబ్లీలో తీర్మానం.. అసలేంటీ గుర్బానీ వివాదం..?

పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో గుర్బానీని సిక్కులు పఠిస్తారు. ఇది వారి పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌లోని ఒక పవిత్ర శ్లోకం. దీన్ని ఎంతో నిష్టగా భక్తులు పఠిస్తారు. అయితే, గుర్బానీ ప్రసార హక్కులు ప్రస్తుతం ఒకే ఛానెల్ దగ్గరున్నాయి.

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 11:45 AM IST

Gurbani Telecast Row: పంజాబ్‌లో గుర్బానీ ప్రసార హక్కులపై వివాదం చెలరేగుతోంది. గుర్బానీని అన్ని ఛానెళ్లలో ఉచితంగా ప్రసారం చేయాలంటూ పంజాబ్‌లోని భగవంత్‌మన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శిరోమణి అకాళీదళ్ సహా కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తప్పుబడుతున్నాయి. ఇంతకీ గుర్బానీ ప్రసారాలపై వివాదం దేనికి..?
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో గుర్బానీని సిక్కులు పఠిస్తారు. ఇది వారి పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌లోని ఒక పవిత్ర శ్లోకం. దీన్ని ఎంతో నిష్టగా భక్తులు పఠిస్తారు. అయితే, గుర్బానీ ప్రసార హక్కులు ప్రస్తుతం ఒకే ఛానెల్ దగ్గరున్నాయి. అది కూడా శిరోమణి అకాళీదళ్ పార్టీకి చెందిన పీటీసీ నెట్‌వర్క్ మాత్రమే ఈ హక్కులు కలిగి ఉంది. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) 2012లో ఆ సంస్థకు ఈ హక్కుల్ని కేటాయించింది. ఎస్‌జీపీసీ సంస్థ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లలో గురుద్వారాల నిర్వహణా బాధ్యతల్ని చూస్తుంటుంది.

ఈ సంస్థ పీటీసీకి మాత్రమే గుర్బానీ ప్రసార హక్కులు ఇవ్వడంతో 2012 నుంచి ఒక్క ఛానెల్‌లోనే ఇది ప్రసారమవుతోంది. ఈ నిర్ణయాన్ని భగవంత్‌మన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. గుర్బానీ అందరి హక్కు అని, ఇది అందరికీ చేరాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రసార హక్కుల్ని ఒక్క ఛానెల్‌కు కాకుండా.. అన్ని ఛానెళ్లకు, అది కూడా ఉచితంగా ఇవ్వాలని తీర్మానించింది. వచ్చే నెలతో పీటీసీకి ఇచ్చిన ప్రసార హక్కులు ముగుస్తాయి. ఆ తర్వాత నుంచి ఆ ఛానెల్‌కు మాత్రమే కాకుండా అందరికీ ప్రసార హక్కులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా ద సిక్ గురుద్వారాస్ యాక్ట్, 1925ను సవరించింది. ఈ మేరకు మంగళవారం పంజాబ్ అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టింది. అలాగే సిక్ గురుద్వారాస్ (అమెండ్‌మెంట్) యాక్ట్, 2023ని తీసుకురానుంది ప్రభుత్వం.

దీని ద్వారా ఇకపై ఎవరైనా గుర్బానీని టీవీల్లో ఉచితంగా ప్రసారం చేయొచ్చు. అందరూ ఉచితంగా వినడం, చూడటం చేయొచ్చు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఇన్నాళ్లూ పీటీసీ సాగించిన గుత్తాధిపత్యానికి చెక్ పడుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎస్‌జీపీసీ సహా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. చట్టంలో మార్పులు చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని, పార్లమెంట్‌కు మాత్రమే ఉందని ఎస్‌జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గురుద్వారాలకు సంబంధించి చట్టాన్ని మార్చే హక్కు కేంద్ర న్యాయశాఖకు మాత్రమే ఉందని, రాష్ట్రానికి ఈ హక్కు లేదని చెబుతోంది. శిరోమణి అకాళీదళ్, బీజేపీ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇది గురుద్వారాల సమగ్రత, సార్వభౌమాధికారంపై దాడి చేయడమే అని ఆ పార్టీలు అంటున్నాయి. కాగా, 1925 నాటి చట్టాన్ని మార్చే హక్కు రాష్ట్ర శాసన వ్యవస్థకే ఉందని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గుర్బానీ అంశం ఇంకెలాంటి రాజకీయ విమర్శలకు దారి తీస్తుందో చూడాలి.