Bill Gates: ప్రపంచ సంపన్నుల్లో ఒకరు బిల్‌గేట్స్. అమెరికాకు చెందిన ఈ బిలియనీర్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరనే సంగతి తెలిసిందే. బిల్‌గేట్స్ గురించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అదే.. ఆయన డ్రైనేజీలోకి దిగడమే కాకుండా.. మలాన్ని శుద్ధి చేసి తయారు చేసిన నీటిని తాగి అందరినీ షాక్‌కు గురి చేశాడు. దీనికో కారణం ఉంది. నవంబర్ 19.. వరల్డ్ టాయిలెట్ డే. ప్రస్తుతం బిల్‌గేట్స్ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పర్యటిస్తున్నారు. వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా అక్కడి డ్రైనేజీ మ్యూజియంను సందర్శించారు.
YS JAGAN: ఎంపీ రఘురామ పిటిషన్‌పై సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు
ఈ సీవర్ మ్యూజియంను భూగర్భంలో ఏర్పాటు చేశారు. మ్యూజియంలోని ఒక మ్యాన్ హోల్ తెరిచి డ్రైనేజీలోకి దిగారు. లోపల కొద్దిసేపు తిరిగారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బిల్‌గేట్స్ వెల్లడించారు. ఈ మ్యూజియంలో తాను శాస్త్రవేత్తలతో సమావేశమైనట్లు తెలిపారు. వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా బ్రస్సెల్స్‌లోని అండర్ గ్రౌండ్ మ్యూజియంకు వెళ్లి అనేక విషయాలు తెలుసుకున్నానని వివరించారు. ప్లాంట్‌లోకి మురుగు నీరు ఎలా చేరుతుంది..? ఆ నీటిని ఎలా శుద్ధి చేస్తారు..? వంటి వివరాల్ని శాస్త్రవేత్తలు వివరించినట్లు తెలిపారు. 1800 సంవత్సరంలో బ్రస్సెల్స్ పరిస్థితికి, ఇప్పటికీ ఊహించనంత తేడా ఉందన్నారు. నాడు నగరంలోని మురుగు నీటిని స్థానిక సెన్నే నదిలోకి విడుదల చేసేవారని, తద్వారా కలరా మహమ్మారి విజృంభించిందని అన్నారు.
మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా.. అక్కడి ప్రభుత్వం మ్యూజియంలోనే మురుగునీటిని శుద్ధి చేసే భారీ ప్లాంట్ నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం బ్రస్సెల్స్ నగరంలో 200 మైళ్ల మురుగునీటి మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఉందని, డ్రైనేజ్ నెట్‌వర్క్, ట్రీట్‌మెంట్ ప్లాంట్లు వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుంటాయని తెలిపారు. అలా మురుగునీటిని శుద్ధి చేసి తీసిన నీటిని బిల్‌గేట్స్ తాగారు.
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.