Birth Certificate: ఇకపై బర్త్ సర్టిఫికెట్ ఒక్కటి చాలు.. కేంద్రం కొత్త రూల్స్.. వచ్చే నెల నుంచే అమల్లోకి..!

రాబోయే అక్టోబర్ 1 నుంచి.. అంటే కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన వాళ్లందరూ బర్త్ సర్టిఫికెట్‌‌ను అన్నింటికీ సింగిల్ డాక్యుమెంట్‌గా వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు అమలవుతున్న బర్త్ సర్టిఫికెట్, బర్త్ ప్లేస్ వంటి వాటికి వేర్వేరు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 08:45 PM IST

Birth Certificate: విద్యా సంస్థల్లో ప్రవేశాలు మొదలుకొని, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వంటి అన్నింటికీ బర్త్ సర్టిఫికెట్ ఒక్కటి సమర్పిస్తే చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త చట్టం వచ్చే అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీని కోసం జనన, మరణాల నమోదు (సవరణ) చట్టాన్ని కేంద్రం అమలు చేయబోతుంది. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును కేంద్రం ఆమోదించింది. అనంతరం ఆగష్టు 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్టానికి ఆమోదముద్ర వేశారు. దీంతో కొత్త చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాబోయే అక్టోబర్ 1 నుంచి.. అంటే కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన వాళ్లందరూ బర్త్ సర్టిఫికెట్‌‌ను అన్నింటికీ సింగిల్ డాక్యుమెంట్‌గా వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు అమలవుతున్న బర్త్ సర్టిఫికెట్, బర్త్ ప్లేస్ వంటి వాటికి వేర్వేరు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సర్టిఫికెట్‌తో ఎన్నో ప్రభుత్వ సేవల్ని పొందవచ్చు. ఓటరు నమోదు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, విద్యా సంస్థల్లో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, పాస్‌పోర్ట్ జారీ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక ఉద్యోగాలకు దరఖాస్తు, నియామకాలు వంటి వాటికి కూడా బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా వాడుకోవచ్చు. ఈ ఒక్క సర్టిఫికెట్ ద్వారా జనన, మరణాలకు సంబంధించిన డేటాను రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుందని ప్రభుత్వం తెలిపింది.

ఇది అమలైతే ప్రత్యేక డేటాను సేకరించాల్సిన అవసరం ఉండదు. గవర్నమెంట్ సర్వీసెస్, పథకాలు, డిజిటిల్ రిజిస్ట్రేషన్ల విషయంలో దీని ద్వారా పారదర్శకత ఏర్పడుతుంది. అలాగే ఆధార్, పాస్‌పోర్ట్ వంటి వాటికోసం వివిధ డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం కూడా ఉండదు. పుట్టిన తేదీ, ప్రదేశం వంటి వివరాలన్నీ ఇకపై సింగిల్ డాక్యుమెంట్‌లో ఉంటాయి. దీనివల్ల దత్తత తీసుకున్న పిల్లల, అనాథల వివరాలు, సరోగసీ పిల్లలు, తల్లిదండ్రులకు దూరమైన పిల్లల గుర్తింపు, నమోదు ప్రక్రియ కూడా సులభతరం అవుతుందని కేంద్రం తెలిపింది. బర్త్ సర్టిఫికెట్ డాక్యుమెంట్ అంగీకరించడం ద్వారా ప్రజలకు సంబంధించిన అనేక సేవలు సులభతరం అవుతాయని కేంద్రం పేర్కొంది. సర్టిఫికెట్ల జారీ విషయంలో వైద్యులకు కూడా సూచనలు చేసింది.